వాషింగ్టన్‌: మీరు అమెరికాలో నివసిస్తున్నారా? ఒక ఎన్నారైగా.. టెక్కీగా అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న మీరు అమెరికా ప్రభుత్వ సాయం తీసుకున్నారా? అయితే మీరు మరొక సమస్యలో చిక్కుకున్నట్లే. 


అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తైన తర్వాత హెచ్ 1 బీ వీసాపై ఉద్యోగం చేస్తూ గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు నిరాశే ఎదురైంది. గ్రీన్‌ కార్డు జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మరిన్నికఠిన నిబంధనలు విధించింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు స్వదేశం అమలు చేస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందకూడదనే కొత్తనిబంధనను విధించింది. 

అమెరికన్లకు, విదేశీయులకు ఫుడ్, నగదు సాయం అందచేస్తున్నది. ఆ సాయం మీరందుకుంటే ‘గ్రీన్ కార్డు’ పొందాలంటే క్లిష్టమే మరి. ఈ నిబంధనల ప్రకారం గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు భారతీయులైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాల ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు. ఆహార, నగదు సంబంధిత పథకాల్లో వీరి పేర్లు నమోదై ఉండకూడదు. విద్య, వైద్య, ఆహార, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వీరికి వర్తించకూడదు. గ్రీన్‌కార్డు వస్తే అమెరికాలో నిలదొక్కుకోగలమని రుజువు చేస్తూ ఆర్థిక వివరాలను బయట పెట్టాల్సి ఉంటుంది.  

ఈ నిబంధలనపై ఇప్పటికే హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ కిరిస్ట్ జెన్ నీస్లే ఈ నెల 21వ తేదీనే సంతకం చేసినట్లు హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ప్రభుత్వ ప్రయోజనాల నుంచి ఎలాంటి లబ్ధి పొందడం లేదని దరఖాస్తుదారు ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన తరువాతే గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టాలి. ఈ నిబంధలన్నింటిని త్వరలోనే అమలు చేయనున్నారు. ఒకవేళ దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలితే వారిపై నిషేధం విధిస్తారు.

కానీ తాజా నిబంధనలపై సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పని చేస్తున్న టెక్ పరిశ్రమ యజమానులు, అమెరికా రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేకించి ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, డ్రాప్ బాక్స్, యాహూ, గూగుల్ తదితర సంస్థలు మండి పడుతున్నాయి. చట్టబద్ధంగా లీగల్ ఇమ్మిగ్రేషన్ తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వేసిన తెర వెనుక ఎత్తుగడ అని విమర్శిస్తున్నాయి. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

గత ఏప్రిల్ నాటికి వచ్చిన దరఖాస్తుల మేరకు 6,32,219 మంది భారతీయ ఇమ్మిగ్రెంట్లు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం గ్రీన్ కార్డు కోసం ప్రాథమికంగా 3,06,400 మంది భారతీయులు వేచి చూస్తున్నారు. వీరితోపాటు వారి జీవిత భాగస్వాములు ప్లస్ పిల్లలు కలిసి గ్రీన్ కార్డు కోసం 3,25,819 మంది ఎదురు చూస్తున్నారు.