ప్రతిభ ఉంటే ‘మనకే’ గ్రీన్ కార్డు.. ట్రంప్ న్యూ ఇమ్మిగ్రేంట్ పాలసీ

  • హెచ్1- బీ వీసా పట్ల కఠినంగా వ్యవహరించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • 54 ఏళ్ల క్రితం నాటి పాలసీ ప్రకారం ప్రతిభావంతులకు 12 శాతం మాత్రమే గ్రీన్ కార్డులు ఇచ్చే వారు. 
  • 57 శాతానికి పెంచుతూ గ్రీన్ కార్డు పాలసీని రూపొందిస్తున్నట్లు ట్రంప్ అల్లుడు.
Trump administration mulls increasing merit-based immigration to 57%. Will it help Indian techies?

వాషింగ్టన్‌: గత కొంతకాలంగా వలసల విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం అమెరికా వచ్చే వారికి ఇకపై మరింత అధికంగా అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రతిభ ఆధారిత ఇమిగ్రేషన్‌ కోటాను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామని పేర్కొంది.

భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించారు‌. గ్రీన్‌కార్డుల జారీలో ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 57శాతానికి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ట్రంప్‌ అల్లుడు, సీనియర్‌ సలహాదారు జారెద్‌ కుష్నర్ వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ సంగతి తెలిపారు. 

ట్రంప్‌ ఆదేశాలతో చేపట్టిన వలస సంస్కరణల ప్రాజెక్టుకు కుష్నర్‌ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా.. త్వరలోనే కాంగ్రెస్‌ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రంప్‌ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 

దీంతో ప్రతిభ ఉన్నవారు గ్రీన్‌కార్డులు పొందే అవకాశం ఉంటుందని, అంతేగాక.. వచ్చే 10ఏళ్లలో అమెరికా పన్ను ఆదాయం కూడా 500 బిలియన్‌ డాలర్ల (రూ.34.41 లక్షల కోట్ల) పెరుగుతుందని కుష్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది 11 లక్షల మందికి అమెరికా పౌరసత్వం లభించిందని, అయితే, ఆ సంఖ్యను మార్చకుండా.. ప్రతిభ ఉన్న వాళ్ళ శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని కుష్నర్ అన్నారు.

‘ప్రస్తుత వలస విధానం చాలా పాతది. ప్రతిభ ఆధారిత కోటా ద్వారా కేవలం 12 శాతం మందికి మాత్రమే గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నాం. కానీ చాలా దేశాల్లో ఈ కోటా చాలా ఎక్కువగా ఉంది. కెనడాలో 53శాతం, న్యూజిలాండ్‌లో 59శాతం, ఆస్ట్రేలియాలో 63శాతం, జపాన్‌లో 52శాతం ఇస్తున్నారు. అందుకే అమెరికాలో దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్‌ ప్రతిపాదించారు’ అని కుష్నర్‌ తెలిపారు. 

ప్రతిభ ఆధారిత కోటా పెంపు గురించి ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌ కూడా స్పందించారు. ఈ కోటాను 57శాతానికి పెంచుతామని, అవసరమైతే మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుందన్నారు. దాదాపు 54 ఏళ్ల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే. 

చట్టబద్ధ వలస విధానంలో ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు కుష్నర్ పేర్కొన్నారు. ఇందులో సగం కుటుంబపరమైన కారణాలు, మానవతా ప్రాతిపదికన ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల వలస చట్టాలను అధ్యయనం చేసిన ఈ నూతన వలస విధానాన్ని రూపొందించామనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న దీన్ని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న విధానం వల్ల నైపుణ్యవంతులైన యువతకు అవకాశాలు దక్కట్లేదని, అందుకే ఈ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించామని ట్రంప్‌ చెప్పారు.  కాగా, హెచ్‌-1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేల మంది భారత నిపుణులకు తాజా నిర్ణయం మేలు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios