ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీంఇండియా ఇవాళ మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలయ్యింది. ఈ విషయం అటుంచితే ఈ మ్యాచ్‌ జరుగుతున్న గబ్బా స్టేడియంలో ఓ అరుదైన సన్నివేశం ఆవిషృతమైంది. 

కాదేదీ కవితకనర్హం  అని ఓ తెలుగు కవి అంటే.. కాదేది ఎన్నికల ప్రచారానికనర్హం అని ఆస్ట్రేలియాలోని తెలంగాణ జాగృతి నాయకులు నిరూపించారు. ప్రస్తుతం  తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో తమ వంతు పాత్ర వహించాలని అనుకున్న ఆస్ట్రేలియాలోని జాగృతి కార్యకర్తలు అందుకు బ్రిస్బేన్ టీ20 మ్యాచ్ సరైందిగా భావించారు. 

ఇంకేముంది ఈ మ్యాచ్ కోసం టికెట్లు బుక్ చేసుకుని టీఆర్ఎస్ ప్లకార్డులతో గ్రౌండ్ లో దర్శనమిచ్చారు. కెమెరా తమ వైపు వచ్చినప్పుడల్లా కేసీఆర్, కవిత, కారు గుర్తు ప్లకార్డులను చూపుతూ నయా ప్రచారం చేపట్టారు. ఈ ఫోటోలను ఆస్ట్రేలియా జాగృతి అధ్యక్షుడు శ్రీకర్ రెడ్డి అందెం నిజామాబాద్ ఎంపి  కవితకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ పై కవిత కూడా స్పందిచారు. మీరంతా కలిసి స్టేడియంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ కు ప్రచారం కల్పించడం బాగుందన్నారు. వీరందరి సపోర్ట్ తో కారు  మరింత వేగాన్ని పుంజుకుంటుందని కవిత ట్వీట్ చేశారు.