సౌదీ అరేబియాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ యువకులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని దమ్మం దహ్రాన్ మాల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. మృతులు ముగ్గురు కేరళ వాసులు కావడం గమనార్హం.

మృతులను వయనాడ్‌కు చెందిన అన్సీఫ్(22), కోజికోడ్ వాసి సనద్(22), మలప్పురంకు చెందిన మహమ్మద్ షిఫీక్(22)గా గుర్తించారు. ముగ్గురు యువకులు సౌదీ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను దమ్మం మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ముగ్గురు కూడా డామా ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థులు అని తెలిసింది. ముగ్గురు యువకుల కుటుంబాలు డామాలోనే నివసిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.