అమెరికాలో తెలుగు విద్యార్థి మరణించాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇత్తిరెడ్డి భార్గవ్‌రెడ్డి  ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. టెక్సాస్‌లోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భార్గవ్‌రెడ్డి అనంతరం ఉద్యోగం నిమిత్తం మిన్నెయాపోలీస్ నగరానికి మకాం మార్చాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి గుండెపోటుకు లోనైన భార్గవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతని మరణవార్తతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చిన్న వయసులోనే భార్గవ్ మరణించడం విషాదకరమని తోటి స్నేహితులు తెలిపారు.. భార్గవ్ ఎప్పుడూ ఇతరులకు సాయపడే వాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు భార్గవ్‌రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమారుడు మరణించాడని తెలియడంతో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.