సౌదీ అరేబియా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలోని మచిలీపట్నానికి చెందిన వ్యక్తి సౌదీలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగి మూడురోజులైన తరువాత ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే, అబ్దుల్ అయాజ్(59) అనే మచిలీపట్నానికి చెందిన వ్యక్తి సౌదీలోని ఓ పాల కంపెనీలో సేల్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో మరో నేపాల్ కు చెందిన వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. 

పని విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కోపోద్రిక్తుడైన నేపాల్ వ్యక్తి అయాజ్ మెడ మీద బలంగా గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అయాజ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. 

అబ్దుల్ అయాజ్ కూతురు సోషల్ మీడియాలో విదేశాంగ శాఖకు ఈ వివరాలను తెలియపరిచిన తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సౌదీ ప్రభుత్వ అధికారులతో చర్చించాలని సౌదీలోని భారతీయ కన్సులేట్ కు భారత విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది.