యూకేలో తెలుగు విద్యార్ధిని మృతి.. చివరి చూపు కోసం అల్లాడిపోతోన్న తల్లిదండ్రులు, కేటీఆర్ ఆపన్న హస్తం
యూకేలో ప్రమాదవశాత్తూ మరణించిన తెలుగు విద్యార్ధిని సాయి తేజస్వి కామారెడ్డి మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు దౌత్య సిబ్బందితో టచ్‌లో వుండాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.
యూకేలో మరణించిన తెలుగు విద్యార్ధిని సాయి తేజస్వి కామారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సహాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్‌కు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేటీఆర్.. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. యూకేలోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ , స్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న విద్యార్ధిని సాయి తేజస్వి ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 11న బ్రైటన్ బీచ్‌లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.
నాటి నుంచి తేజస్వి భౌతికకాయం యూకేలోని ఆసుపత్రిలోనే వుంది. చట్టపరమైన లాంఛనాలు, ఇతరత్రా ఖర్చు నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులకు భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సాయి తేజస్వి బంధువు ప్రదీప్ రెడ్డి GoFundMe.com ద్వారా మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కావాల్సిన విరాళాలు సేకరించేందుకు ప్రయత్నించారు. సోమవారం నాటికి 19,000 పౌండ్లకు పైగా విరాళాలు అందినట్లుగా తెలుస్తోంది.
సాయి తేజస్వి మరణ వార్తే అంతులోని దు:ఖాన్ని కలిగిస్తుంటే.. ఆమె మృతదేహాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావడం మరింత బాధపెడుతోందని ప్రదీప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలన్న లక్ష్యాన్ని అందుకోకముందే ఆమె కలలు కల్లలయ్యాని ఆయన పేర్కొన్నారు. ఇంతలో తేజస్వీ సోదరి ప్రియా రెడ్డి.. ట్వీట్టర్ ద్వారా కేటీఆర్ సాయం పొందేందుకు ప్రయత్నించారు. తన సోదరి భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడానికి తమ కుటుంబం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అందువల్ల ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సహాయం చేయాలని ప్రియా రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.