Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో తెలుగు కుటుంబం హత్య: కుటుంబ పెద్దే హంతకుడు

అమెరికాలోని అయోవాలో హత్యకు గురైన తెలుగు కుటుంబం కేసులో మిస్టరీ వీడింది. 

telugu family murder in america
Author
United States, First Published Jun 18, 2019, 12:09 PM IST

అమెరికాలోని అయోవాలో హత్యకు గురైన తెలుగు కుటుంబం కేసులో మిస్టరీ వీడింది. వెస్ట్ డెస్ మోయినెస్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న చంద్రశేఖర్ సుంకర కుటుంబం ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే.

భార్యా, పిల్లలను చంపిన అనంతరం చంద్రశేఖర్ తనను తాను కాల్చుకున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన చంద్రశేఖర్‌కు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తకోటకు చెందిన లావణ్యతో 2003లో ఆయనకు వివాహమైంది.

ఆ తర్వాత రెండేళ్లకే వీరు అమెరికా వెళ్లిపోయారు. ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పూర్తి చేసిన లావణ్య అక్కడ నాసాలో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. చంద్రశేఖర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

వీరికి 15, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే చంద్రశేఖర్, లావణ్య దంపతులు ఈ ఏడాది మార్చిలో వెస్ట్‌డెస్‌మొయిన్స్‌లో ఒక ఇల్లు కొన్నారు. శనివారం గృహప్రవేశం జరిగింది.

అంతా కలిసి ఇంటికి దగ్గరలోని ఒక రెస్టారెంట్‌లో విందు ఆరగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎవరి గదుల్లో వారు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రశేఖర్ తొలుత బాల్కనీ వద్ద భార్యను చంపాడు.

ఈ శబ్ధం విన్న లావణ్య తండ్రి సీతారామిరెడ్డి తన గది నుంచి బయటకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న చంద్రశేఖర్‌ ఏమీ లేదు.. మీరు వెళ్లి పడుకోండి.. పిల్లలు పడుకున్నారో లేదో చూస్తున్నాను అని బదులిస్తూ.. పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్లాడు.

ఆ తర్వాత మళ్లీ వరుసగా శబ్ధాలు రావడంతో సీతారామిరెడ్డి పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లి చూశారు. చంద్రశేఖర్, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడివున్నారు. బాల్కనీలో లావణ్య మృతదేహం కనిపించింది.

దీంతో ఆయన కేకలు వేస్తూ బయటికి పరుగులు తీసి.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీతారామిరెడ్డి మాట్లాడుతూ... తన అల్లుడు మూడు నెలల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని.. పెద్ద కుమారుడికి ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios