సెలవులు కదా అని స్వదేశానికి వచ్చాడు. సరదాగా స్నేహితులతో కలిసి అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ అడ్వెంచర్ బెడసికొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన అరవింద్ కుమార్ పీచర(45) ఉద్యోగ రిత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. ఇటీవల ఆయన సెలవుల నేపథ్యంలో స్వస్థలానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం తన స్నేహితులతో కలిసి వికారాబాద్ వెళ్లాడు. అక్కడ గోధమగూడలోని హిల్స్ అండ్ వాలీ అడ్వెంచర్ రిసార్ట్‌కి వెళ్లారు. అందులో మౌంటెన్ బైక్ ని అరవింద్ నడిపాడు.

ఈ క్రమంలో ఆ బైక్ తిరగబడింది. దానిని అరవింద్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో.. తీవ్రగాయాలపాలై కన్నుమూశాడు. ఈ ఘటనంతా అరవింద్ స్నేహితుల కళ్ల ముందే జరగడం గమనార్హం. వారి సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సెలవుల కోసం వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడంపై అరవింద్ కుటుంబంలో విషాదం అలుముకుంది. సరైన గైడెన్స్ లేకుండా అడ్వెంచర్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.