అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. గన్ మిస్ ఫైర్ అయిందా?, హత్య జరిగిందా?..
అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మరణించాడు. అయితే అతడు గన్ మిస్ ఫైర్ కావడం వల్ల చనిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మరణించాడు. అయితే అతడు గన్ మిస్ ఫైర్ కావడం వల్ల చనిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలు.. ఖమ్మంలోని జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన మహంకాళీ ఉమాశంకర్, మాధవి దంపతుల కుమారుడు అఖిల్‌సాయి. ఉమాశంకర్, మాధవి దంపతుల హైదరాబాద్‌లో నివాసం ఉంటూ కిరాణా షాపు నడుపుతున్నారు.
మహంకాళి అఖిల్‌సాయి ఎంఎస్ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి అక్కడ సెక్యూరిటీ గార్డు గన్ మిస్ ఫైర్ అయి అఖిల్‌సాయి గాయపడినట్టుగా అతని తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించినట్టుగా తెలిసింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడి పోలీసులు రవితేజ గోలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో.. అఖిల్‌సాయి మృతికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలబామాలోని మోంట్‌గోమెరీలోని ఈస్టర్న్ బౌలేవార్డ్‌లోని 3200 బ్లాక్‌లో ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మోంట్‌గోమెరీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రి 9:30 గంటలకు స్పందించారు. అక్కడ 25 ఏళ్ల అఖిల్ సాయి మహంకాళి కాల్పుల్లో గాయపడినట్టుగా గుర్తించారు. వెంటనే అఖిల్ సాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ సాయి మృతి చెందాడు. అయితే పోలీసులు ఘటన స్థలంలోని నుంచి రవితేజ గోలీని (23) అదుపులోకి తీసుకున్నారు. అతడిని మోంట్‌గోమేరీ కౌంటీ టెన్షన్ ఫెసిలిటీలో ఉంచారు.