ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే విగతజీవిగా వస్తున్నాడని తెలుసుకుని ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  చేతికొచ్చిన కొడుకు బలవన్మరణం చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కెనడాలో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నల్గొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లిలో విషాదం నిండింది. 

ఆకుతోటపల్లికి చెందిన నారాయణ రావు, హైమావతి కుమారుడు ప్రవీణ్ రావు 2015లో ఉన్నత చదువులకోసం కెనడా వెళ్లాడు. ఏమైందో ఏమో గాని గురువారం తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని షాకింగ్ న్యూస్ చెప్పారు.
 
ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రవీణ్ రావు మృతి చెందాడు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు. కొద్దిరోజుల్లో అతడి మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే ప్రవీణ్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియడం లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.