సిద్ధిపేట: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జనార్దన్ రెడ్డి అనే విద్యార్థి గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం 11.53 నిమిషాలకు తుది శ్వాస విడిచాడు. 

జనార్దన్ రెడ్డి సిద్ధిపేట జిల్లా గజ్వెల్ కు చెందినవాడని తెలుస్తోంది. గత రాత్రి వరకు అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని, మర్నాడు ఉదయం 4 గంటల ప్రాంతంలో శ్వాససంబంధమైన సమస్య తలెత్తిందని జనార్దన్ రెడ్డి అన్న సంజీవ రెడ్డి చెప్పారు .

జనార్దన్ రెడ్డి (26) తన మిత్రుడితో కలిసి బైక్ పై ప్రయాణిస్తుండగా మే 11వ తేదీన మలుపు తీసుకోబోయిన కారును ఢీకొట్టారని అంటున్నారు. గాయపడిన అతని 24 ఏళ్ల మిత్రుడు చికిత్స పొంది డిశ్చార్జీ కాగా, అప్పటి నుంచి జనార్దన్ రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

ప్రమాదం జరగడానికి రెండు నెలల క్రితమే జనార్దన్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో అతను అకౌంటెన్సీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. 

జనార్దన్ రెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది.