తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ' వైబ్రాన్ట్ తెలంగాణ ' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. 

అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా కేసీఆర్ చేపట్టిన ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ సాధించేందుకు ఆయన అనుసరించిన వ్యూహాత్మక   కార్యాచరణ గురించి వినోద్ కుమార్ వివరించారు.

రైతుల ఆత్మహత్యలు,  విద్యుత్ సమస్యలు, యువత తీవ్రవాదం వైపు మరలు తుండటం, పోలీసులపై దాడులు, అన్ని రంగాల్లో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయం పై గళమెత్తి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమించినట్లు వినోద్ కుమార్ తెలిపారు.

Also Read:హుజూర్‌నగర్‌లో ప్రజల కసి కనిపించింది: మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ సాధనే లక్ష్యంతో 2004లో కేంద్ర యూపీఏ ప్రభుత్వం లో చేరినపుడు అనేక విమర్శలు వచ్చాయని, వాటిని లెక్క చేయకుండా కామన్ మినిమమ్ ప్రోగ్రాం అజెండాలో తెలంగాణ అంశం చేర్చిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఉద్యమకారులుగా తెలంగాణ కోసం యూపీఏ ప్రభుత్వంలో చేరడం తప్పు కాదన్న విశ్వాసం కేసీఆర్ కు ఉండేదని, కేసీఆర్ ఎన్నడూ తప్పు చేయరని ప్రజలకు నమ్మకం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినోద్ కుమార్ వివరించారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి చేస్తున్న అప్పు తప్పు కాదని, అవి భవిష్యత్ తరాలకు పెట్టుబడులు అని వినోద్ కుమార్ అన్నారు.

విద్యుత్, ఇరిగేషన్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించామని అన్నారు.  ఇరిగేషన్ పనులకు పెట్టె ప్రతి రూపాయి వంద రేట్లు పెరుగుతుందని, రాబోయే తరానికి ఇది గొప్ప వరం అని వినోద్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని ఆయన తెలిపారు.

Also Read:అన్ని పదవుల్లోనూ ఉద్యమకారులకే పెద్దపీట...ఇందులో కూడా..: మంత్రి గంగుల

ఆర్టీసీ సమ్మెపై పలువురు అడిగిన ప్రశ్నలకు వినోద్ కుమార్ సమాధానం ఇచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలిగించడం సరైనది కాదన్నారు. రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఏకైక లక్ష్యం తో , ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నట్లు వినోద్ కుమార్ వివరించారు.

న్యూయార్క్ లో మారథాన్  పరుగులో 42 కిలోమీటర్ల దూరం పరుగెత్తిన వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ని ఈ సదస్సులో నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గ్రామీణాభివృద్ధి కోసం, రైతులు, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ని జ్యోతి కొనియాడారు. 

తెలంగాణ ఉద్యమంలో, ప్రస్తుతం తెలంగాణ ఎన్నారై లు అందజేసిన, అందిస్తున్న సహకారం స్ఫూర్తి నిస్తోందని వినోద్ కుమార్ అన్నారు