అమెరికాలో కాల్పులు: తెలంగాణవాసి మృతి, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు
మాస్క్ ధరించిన యువకుడు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ కమ్ డిపార్టుమెంటల్ స్టోరులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గోవర్ధన్ రెడ్డి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. మరో గంటలో స్టోర్ మూసేసి ఇంటికి వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్: తెలంగాణకు చెందిన కొత్త గోవర్ధన్ రెడ్డి అనే 48 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను మరణించాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్లోరిడాలోని పెన్సకోలాలో ఈ ఘటన జరిగింది.
మాస్క్ ధరించిన యువకుడు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ కమ్ డిపార్టుమెంటల్ స్టోరులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గోవర్ధన్ రెడ్డి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. మరో గంటలో స్టోర్ మూసేసి ఇంటికి వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
కౌంటర్ మేనేజర్ గా పనిచేస్తున్న గోవర్ధన్ రెడ్డిపై సాయుధుడు కాల్పులు జరిపాడని చెబుతున్నారు. స్టోర్ నుంచి డబ్బులేమీ తీసుకోకుండానే కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు పారిపోయాడు.
గోవర్ధన్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు హైదరాబాదులోని ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం వారికి అతని మరణం విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గోవర్ధన్ రెడ్డి ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అప్పటి నుంచి స్వస్థలం తిరిగి రాలేదు. నిజానికి, అతను యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందినవాడు. ఏప్రిల్ లో ఆయన తిరిగి రావాలని అనుకున్నారు.