అమెరికాలో ప్రతి ఏడాది జరిగే తానా మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు హాజరవుతుంటారు. అయితే ఈసారి ఓ ప్రత్యేక అతిథిని తానా మహాసభల నిర్వహకులు ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను ఈసారి తానా  సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తానా మహాసభల అధ్యక్షుడు సతీష్ వేమన స్వయంగా కేటీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన ఆయన తప్పకుండా పాల్గొనడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా కలిసి ప్రతి ఏడాది అత్యంత ఘనంగా తానా మహాసభలు జరుపుతుంటారు. అలా ఈ ఏడాది కూడా తానా 22 వ మహాసభలను జూలై 4-6 వ తేదీలు అంటూ మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మహానగరంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరిపేందుకు నిర్వహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 

ఇక ప్రతిసారి మాదిరిగానే ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. అయితే తెలంగాణలో కేటీఆర్ తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లకు కూడా ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. వీరందరికి స్వయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహా సభల అధ్యక్షుడు సతీష్ వేమన ఆహ్వాన పత్రిక అందించారు.