న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐటీ నిపుణుల పట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరితో టెక్నాలజీ దిగ్గజాలకు తలబొప్పి కడుతోంది. హెచ్ 1 బీ వీసాలను జారీ చేయడంలో ఆంక్షలు విధించడంతో అమెరికాలో స్థానికంగా నిపుణుల కొరత ఐటీ సంస్థలను వెంటాడుతున్నది. ఈ క్రమంలో అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలన్నీ పరస్పరం ఇతర సంస్థల్లోని నిపుణులపై వల విసురుతుండటంతో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షల అమలుతోపాటు స్థానిక నిపుణులను తీసుకోవడం లేదని ఐటీ సేవలందుకునే సంస్థలు ఐటీ దిగ్గజాలకు ఆన్ సైట్ ప్రాజెక్టులు ఇవ్వడం తగ్గించేస్తున్నారు. 

ట్రంప్ అనుసరిస్తున్న ఆత్మరక్షణ ధోరణి భారతీయ ఐటీ సంస్థలు స్థానిక ఐటీ నిపుణుల కోసం వెతుకులాటకు దారి తీసింది. అత్యంత నిపుణులైన స్థానికులు దొరక్క ఐటీ సంస్థలు అల్లాడుతున్నాయి. ఒకవేళ కొందరు నిపుణులు దొరికినా ఆయా సంస్థలకు వచ్చే ప్రాజెక్టుల్లో ఎవరెవరిని నియమించాలన్న విషయమై సంస్థల మేనేజ్మెంట్లు తల పట్టుకుంటున్నాయి. 

స్థానిక అమెరికా నిపుణులను సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) రంగాల్లో వాడలేదు. ఈ ఉద్యోగాలు చేయగల నిపుణులను హెచ్ 1 బీ వీసాల కింద నియమించుకోవాల్సిందేనని టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. అన్ని సంస్థల నుంచి స్థానిక నిపుణుల నియామకాలు పెంచుతున్నాం. ఫార్చ్యూన్ 500, విద్యాసంస్థల నుంచి నియామకాలు చేస్తున్నామని తెలిపారు. 

2017 చివరి నాటికి హెచ్ 1 బీ వీసా నిపుణులు 34.6 లక్షల మంది ఉంటే వారిలో భారతీయులు 22 లక్షల మంది. అత్యధిక ప్రాజెక్టులు అమెరికాలోని టెక్ దిగ్గజాలు యాపిల్, ఫేస్ బుక్, గూగుల్, భారతీయ ఐటీ సంస్థల నుంచే వస్తున్నాయి. అందువల్లే ఎక్కువ మంది భారతీయ ఐటీ నిపుణుల నియామకాలు హెచ్ 1 బీ వీసా కింద ఎక్కువగా సాగుతున్నాయని ఇండస్ట్రీ లాబీ గ్రూప్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) తెలిపింది. 

నాస్కామ్ తెలిపిన వివరాల ప్రకారం 2017 నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు 65 వేల హెచ్ 1 బీ వీసాలు (12%) పొందాయి. స్థానిక నిపుణుల కొరత వల్ల నియామకాలు కష్టంగా మారాయి. ఏటా అమెరికాలో నూతన ఇంజినీర్ల కోసం 2 నుంచి మూడు శాతం డిమాండ్ పెరుగుతుంది. అంటే ఏటా రెండు లక్షల మంది నిపుణులు అధికంగా కావాలన్న మాట. అమెరికాలోని 60 లక్షల మంది ఐటీ నిపుణుల్లో హెచ్ 1 బీ వీసా దారులు 10 శాతం ఉంటారు. కానీ ట్రంప్ ఆంక్షల వల్ల ఇప్పటికిప్పుడు వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా స్థానిక నియామకాల్లో కొరత నెలకొంది. 

కాగ్నిజెంట్ స్ట్రాటర్జీ హెడ్ మాల్కమ్ ఫ్రాంక్ మాట్లాడుతూ స్థానిక నియామకాల కోసం అమెరికాలోని విద్యా సంస్థలు, యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నామని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా స్థానిక నిపుణుల నియామకాలకు క్యాంపస్ సెలక్షన్లు దూకుడుగా చేయాల్సి వస్తోందన్నారు. 

భారతీయ ఐటీ దిగ్గజాల్లో ఒక్కటైన ఇన్ఫోసిస్ ఇప్పటికే 10 వేల మంది స్థానికుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. గత ఐదేళ్లలో 12,500 మందికి పైగా స్థానిక ఐటీ నిపుణులను టీసీఎస్ నియమించుకున్నది. అమెరికాలో ఐటీ బిజినెస్ పెరగడంతో తమ కంపెనీలోనే 400 మందిని నియమించుకున్నట్లు జెన్సార్ టెక్నాలజీస్ సీఈఓ సందీప్ కిశోర్ చెప్పారు.