ప్రియురాలితో కలిసి.. తనతో విడిపోయిన భార్యను చంపాలని ప్లాన్ వేశాడు. అందుకు.. ఓ కిల్లర్ కి సుపారీ ఇచ్చి బేరం కుదర్చుకున్నాడు. చివరకు ప్లాన్ బెడసి కొట్టి.. చట్టానికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన నర్సన్ లింగాల(55) ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాడు. కొన్ని సంవత్సరాల క్రితం భార్యతో విడిపోయాడు. అతనికి సంధ్యా రెడ్డి(52) అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో జీవితం హాయిగా ఉండాలంటే.. భార్య అడ్డు తొలగించాలనుకున్నాడు. 

అందుకు.. ఎవరైనా కిల్లర్ దొరుకుతాడేమోనని వెతికాడు. కాగా.. అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్న ఓ పోలీసుకి ఈ విషయం తెలిసింది. తనను తాను కిల్లర్ గా అతనికి పోలీసు పరిచయం చేసుకున్నాడు. న్యూ జెర్సీలోని ఓ షాపింగ్ మాల్ లో లింగాల.. తన గర్ల్ ఫ్రెండ్ సంధ్యారెడ్డితో కలిసి అతనిని కలిశాడు.

వాళ్లు ఎవరిని చంపాలనుకుంటున్నారు..? ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే ప్రతీ విషయాన్ని ఆ పోలీసు చాకచక్యంగా వీడియోలో రికార్డు చేశాడు. నా భార్య మళ్లీ నా జీవితంలో తిరిగా రాకూడదు.. ఆమె పూర్తిగా దూరం కావాలి అంటూ.. లింగాల చెప్పిందంతా ఆ వీడియోలోరికార్డు అయ్యింది. తన భార్యను చంపేందుకు 10వేల డాలర్లు ఇవ్వడానికి కూడా అతను అంగీకరించాడు. 

ఈ విషయాలన్నీ కిల్లర్ అనుకొని పోలీసులకు చెప్పడంతో .. లింగాల, అతని గర్ల్ ఫ్రెండ్ అడ్డంగా బుక్కయ్యారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు కోర్టులో నడుస్తోంది. వీరికి బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. ఈ ఇద్దరికీ పదేళ్ల జైలు శిక్ష 2లక్షల50వేల డాలర్ల జరిమానా శిక్షగా పడే అవకాశం ఉంది.