ఎన్నారై, టిఆర్ఎస్ పార్టీ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ నల్లమాద దేవేందర్ రెడ్డి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో కారులో మృతి చెందారు. దేవేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా దేవర కొండకు చెందినవారు కావడం గమనార్హం.

ఆయన ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేవేందర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అలాగే అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. 

దేవేందర్‌రెడ్డి ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయం అందించడంలో ముందుంటాడని యూఎస్‌లోని అతని స్నేహితులు తెలిపారు. అమెరికాలో తెలంగాణ సొసైటీ ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించారు. దేవేందర్ రెడ్డితో ఉన్న  అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు నివాళుర్పించారు. కాగా.. ఆయన మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేవేందర్ రెడ్డి మృతి పై ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎలా చనిపోయారనే విషయం తెలిస్తే..  దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.