Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడు పాపం కేంద్ర ప్రభుత్వానిదే: ఎన్ఆర్ఐ టీఆర్ఎస్

పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు

nri trs leader Anil Kurmachalam fires on center over pothireddypadu issue
Author
Hyderabad, First Published May 14, 2020, 2:48 PM IST

పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం సరైన నిర్ణయం కాదన్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే టి.ఆర్.యస్ పార్టీ ఉపేక్షిందని, తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంలా భావించే కేసీఆర్ ఎవరికీ నష్టం కలిగినా రాజీలేని పోరాటం చేస్తారని అనిల్ అన్నారు.

ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం లో ఎలాగైతే ద్వంద వైఖరిని అవలంబించిందో, నేడు కృష్ణా జలాల వివాదంపై కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నాయకులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని  అనిల్ కూర్మాచలం ఫైర్‌ అయ్యారు.

ఇప్పటికే కృష్ణా బోర్డు ఇన్‌చార్జ్‌ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ భేటీ అయ్యారని ఆయన గుర్తుచేశారు.  ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై రజత్ కుమార్ ఫిర్యాదు చేశారని..  ఏపీ కొత్త ప్రతిపాదనల వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై వివరణ ఇచ్చారని అనిల్ వెల్లడించారు.  

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై ఫిర్యాదుపాటు న్యాయపరంగా పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందని అనిల్ కూర్మాచలం తెలిపారు. పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికి నాటి నుండి నేటి వరకు పాలిస్తున్న కేంద్ర  ప్రభుత్వాలదేనని ఆయన విమర్శించారు.

నదీ జలాల  పంపిణీ విషయం లో కేంద్ర  ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దేశమంతటా ఇదే సమస్య ఉందన్నారు. బాధ్యత కేంద్రం పైన ఉంటే చిత్తశుద్ధితో పరిష్కరించకుండా రాష్ట్రాల మధ్య వైరం పెంచుతున్నారని అనిల్ ఆరోపించారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా ఏదో ఒక నదీ జలాల సమస్య ఉందని, బీజేపీ-కాంగ్రెస్‌‌‌లు గల్లీలో కాకుండా ఢిల్లీలో కొట్లాడాలని అనిల్ సూచించారు. నాడు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని కూర్మాచలం తెలిపారు.

తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి కేసీఆర్ పిలుపునిస్తే ఎలాంటి పోరాటానికైనా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని అనిల్ స్పష్టం చేశారు. పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపకఅధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు

Follow Us:
Download App:
  • android
  • ios