గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకి ఎన్నారై విద్యార్థి ఆత్మహత్య..
శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడి ప్రసిద్ధ గోల్డెన్ గేట్ వంతెన మీదినుంచి దూకి తనువు చాలించాడు.
అమెరికా : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా శాన్ఫ్రాన్సిస్కోలో ప్రసిద్ధ గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకేశాడు. ఈ భారతీయ అమెరికన్ యువకుడి బలవన్మరణం గురించి అతని తల్లిదండ్రులు, యూఎస్ కోస్టల్ గార్డ్స్ అధికారులు వివరాలు తెలిపారు. పన్నెండో తరగతి చదువుతున్న సదరు విద్యార్థి బుధవారం సాయంత్రం 4.58 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుడే వంతెన పైనుంచి దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అతను వంతెన పైనుంచి దూకిన రెండు గంటల తర్వాత గానీ.. విషయం తెలియలేదు. దీంతో అప్పుడు యూఎస్ కోస్టల్ గార్డ్ గాలింపు చేపట్టారు.
ఇలా ఒక భారతీయ అమెరికన్ గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనల్లో ఇది నాలుగోది. ఈ మేరకు ఎన్నారై అజయ్ జైన్ భుట్టో రియా చెప్పారు. గతేడాది 25 మంది గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి తమ జీవితాలను ముగించారు. 1937వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆత్మహత్య ఘటనలు నివారించాలని.. బ్రిడ్జికి రెండు వైపులా 1.7 మైళ్ల వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.