అమెరికాలోని న్యూయార్క్ లో ఓ ఎన్ఆర్ఐ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేయడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

న్యూయార్క్ లోని లిండెన్ హార్ట్స్ లో గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లా భద్రన్ నగరానికి చెందిన కింషుక్ పటేల్(33) స్థిరపడ్డాడు. అక్కడ పటేల్ డాపర్ స్మోక్ షాప్ నిర్వహిస్తున్నాడు. బుధ‌వారం రాత్రి 9.30 గంట‌ల‌(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ప్రాంతంలో షాపు మూసివేసి ఇంటికి బ‌య‌ల్దేర‌డానికి రెడీ అవుతున్నాడు. ఇంత‌లో న‌లుగురు వ్య‌క్తులు కింషుక్ షాపున‌కు వెళ్లారు. త‌మ‌కు కొన్ని వ‌స్తువులు కావాల‌ని అడిగారు. దాంతో దుకాణం మూసివేసే వేళ అయింద‌ని, ఇప్పుడు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని వారితో చెప్పాడు.

అంతే.. ఆ న‌లుగురు కింషుక్‌ను విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కొట్టి.. వారికి కావాల్సిన‌వి తీసుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దుండ‌గుల దాడిలో తీవ్రంగా గాయ‌డిన కింషుక్ స్పృహ కోల్పోయాడు. ఇక రోజూ ఇంటికి స‌మ‌యానికి తిరిగి వ‌చ్చే కింషుక్ రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఫోన్ చేశారు. కానీ, కింషుక్ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. దాంతో అత‌డి మిత్రుడు అంకూర్ ప‌టేల్‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పారు. వారి స‌మాచారంతో అంకూర్‌  వెంట‌నే కింషుక్ షాపున‌కు వెళ్లాడు. షాపు తెరిచే ఉంది. లోప‌లికి వెళ్లి చూస్తే త‌ల‌పై తీవ్ర గాయాల‌తో కింషుక్ ర‌క్త‌పు మ‌డుగులో అచేత‌నంగా ప‌డి ఉన్నాడు.

వెంట‌నే ఈ విష‌యాన్ని కింషుక్ కుటుంబ స‌భ్యుల‌కు తెలియజేసిన అంకూర్‌.. హూటాహూటిన అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌రలించే ప్ర‌య‌త్నం చేశాడు. కాన్నీ, అప్ప‌టికే చాలా రక్తం పోవ‌డంతో మార్గం మ‌ధ్య‌లోనే కింషుక్ ప్రాణాలొదిలాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల‌ను గుర్తించే ప‌నిలో ఉన్నారు. కింషుక్ భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, త‌న తండ్రితో న్యూయార్క్‌లో ఉంటున్న‌ట్లు అంకూర్ చెప్పాడు. కింషుక్ చివ‌రిసారిగా 2020లో లాక్‌డౌన్‌కు ముందు భార‌త్‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.