కెనడాలో తెలుగు యువకుడు మిస్సింగ్.. నెల రోజులు గడిచిన దొరకని ఆచూకీ..
కెనడాలో తెలుగు యువకుడు అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. అతడు కనిపించకుండా పోయిన నెల రోజులు దాటిన ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు.
కెనడాలో తెలుగు విద్యార్థి అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. అతడు కనిపించకుండా పోయిన నెల రోజులు దాటిన ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. వివరాలు.. ఏపీలోని సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనకు చెందిన నిడమానూరి శ్రీధర్ ఏప్రిల్ 21న కెనడాలో కనిపించకుండా పోయాడు. శ్రీధర్ జాడ తెలీక నెల రోజులు దాటిపోయింది. ఇప్పటికీ శ్రీధర్ ఆచూకీ లభించలేదు. దీంతో శ్రీధర్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.
అయితే శ్రీధర్ నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. కొంతకాలం కిందట అక్కడే ఉద్యోగం వచ్చింది. అయితే కొన్ని వారాల స్వదేశానికి వచ్చిన శ్రీధర్.. ఏప్రిల్ 6వ తేదీన తిరిగి కెనడాకు వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత 15 రోజులకే శ్రీధర్ కనిపించకుండా పోయాడు. శ్రీధర్ విధులకు హాజరుకాకపోవడంతో.. యజమాని అతడిని రీచ్ కాలేకపోయాడు. దీంతో యజమాని అత్యవసర కాంటాక్ట్‌కి కాల్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీధర్ అదృశ్యమైన విషయం అతడి స్నేహితులు, ఫ్యామిలీకి తెలిసింది.