యూకే ఎన్నికల్లో భారతీయలు... ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడితో సహా..
రిషితోపాటు... చాలా మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి గెలిచిన వారిలో కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన్ మోహింద్రా ఉంటే, లేబర్ పార్టీ తరఫున నవేంద్ర మిశ్రా ఉన్నారు.
యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు సత్తా చాటారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయకేతనం ఎగరవేయగా.. బోరిస్ జాన్సన్ ప్రధానిగా బాధ్యతలతు చేపట్టారు. శుక్రవారం ఫలితాలు వెలువడగా... కన్జర్వేటివ్ పార్టీ మొత్తం 650 స్థానాలకు గాను 364సీట్లు గెలిచింది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 203 స్థానాలకు పరిమితమైంది. మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాలు సాధించిన కన్జర్వేటివ్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది.
కాగా... ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించి విజయం ఢంకా మోగించారు. కన్జర్వేటివ్, లేబర్ పార్టీ... రెండు పార్టీల తరపున ఎన్ఆర్ఐలు పోటీ చేసి గెలుపొందడం విశేషం.
ఇలా విజయం సాధించిన వారిలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి కూడా ఉన్నారు. తన ప్రత్యర్థిపై 27,210 ఓట్లతో రిషి విజయం సాధించారు. రిషి.. ఇంగ్లాండ్ లోని హాంప్ షైర్ కౌంటీలో జన్మించారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్ షైర్ లోని రిచ్ మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో నే నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కాగా... రిషితోపాటు... చాలా మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి గెలిచిన వారిలో కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన్ మోహింద్రా ఉంటే, లేబర్ పార్టీ తరఫున నవేంద్ర మిశ్రా ఉన్నారు. మాజీ యూకే హోమ్స్ సెక్రెటరీ ప్రీతి పటేల్ కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎసెక్స్‌లోని వితం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ప్రీతి విజయం సాధించారు.
అలాగే రీడిండ్ వెస్ట్ నుంచి బరిలోకి దిగిన మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ అలోక్ శర్మ గెలుపొందారు. నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్‌షైర్ నుంచి పోటీ చేసిన మరో భారత సంతతి వ్యక్తి శైలేష్ వరా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఫేర్‌హామ్‌లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున బరిలోకి దిగిన సుయెల్లా బ్రావెర్మాన్ కూడా భారీ మెజారిటీతో విజయఢంకా మోగించారు.
అలాగే స్టాక్పోర్ట్ నుంచి నవేంద్ర మిశ్రా గెలిచారు. తొలి బ్రిటిష్ సిక్కు మహిళ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మరోసారి బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ నుంచి గెలిచారు. స్లాఫ్ నుంచి బరిలోకి దిగిన ధేసీ తన సమీప ప్రత్యర్థి భారత సంతతి వ్యక్తి కన్వాల్ టూర్ గిల్‌పై గెలవడం గమనార్హం. మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ ఈలింగ్ సౌతాల్ నుంచి గెలుపొందారు. మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు లీసా నాండే, సీమా మల్హోత్రా కూడా ఈ ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసిన వారిలో ఉన్నారు.