అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇండియన్ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.  మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడుగా గుర్తించారు. గుర్తుతెలియని దుండగుడు ఒకరు తుపాకీతో కాల్చి చంపేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... కర్నాటక రాష్ట్రం మైసూరుకు చెందిన అభిషేక్ సుదేష్ భట్‌(25). కాలిఫోర్నియా యూనివర్సిటీలోకంపూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. హోటల్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేసుకుంటున్న అభిషేక్‌పై  గురువారం రాత్రి దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు.

 విధులు ముగించుకొని తిరిగి రూమ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అతని కజిన్‌ రామ్‌నాథ్ ఘటనాస్థలికి వెళ్లి చూసేసరికి అభిషేక్ రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. 

దాంతో వెంటనే విషయాన్ని అభిషేక్ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి తండ్రి సుదేష్ చంద్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే తన కుమారుడితో మాట్లాడానన్నారు. గురువారం రాత్రి 11.15 గంటలకు తనకు అభిషేక్ మెసేజ్ కూడా చేశాడని, ఆ తరువాత 15 నిమిషాలకే అతను చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని తండ్రి తెలిపాడు. 

ఇంకో నాలుగు నెలలు అయితే మాస్టర్స్ పూర్తైయేదని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. కాగా, అభిషేక్ మృతదేహాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆలస్యం కానుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా శాన్ బెర్నార్డినోలో రోడ్డు రవాణాను నిలిపివేశారు. తన కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సుదేష్ చంద్ స్థానిక ఎంపీ ప్రతాప్ సింహా, డిప్యూటీ కమిషనర్ అభిరామ్ జి. శంకర్‌లను కలిసి సహాయం కోరారు.