ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ వైద్య విద్యార్థి మృతి..
ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందజేశారు.
ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందజేశారు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి రామలింగంపల్లికి చెందిన రాంరెడ్డి, రాధ దంపతుల కుమారుడు మణికాంత్ రెడ్డి. ఫిలిప్పీన్స్‌లో దావో మెడికల్ కాలేజీలో మణికాంత్ రెడ్డి ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే మణికాంత్ రెడ్డి మరణించినట్టుగా అతడి తల్లిదండ్రులకు ఆదివారం సమాచారం అందింది.
అయితే మణికాంత్ రెడ్డి ఓపెన్ డ్రైనేజ్ కాలువలో పడి మృతిచెందినట్టుగా అక్కడి అధికారులు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ భవనం మెట్లపై నుంచి జారిపడి ఓపెన్ డ్రైనేజీ కాలువలో పడి మణికాంత్ రెడ్డి మృతి చెందినట్లు చెబుతుండగా.. మరోవైపు మణికాంత్ మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తుండగా డ్రైనేజీ కాలువలో పడి ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మణికాంత్ మరణానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి ఫిలిప్పీన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మణికాంత్ రెడ్డి మరణవార్తతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.