అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది.  కాగా.. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రమాదవశాత్తు  చనిపోయిందా..లేక హత్య చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత, అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న  చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడతో 2016లో వివాహమైంది.

2017లో సుధాకర్ దంపతులు అమెరికా వెళ్లారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్ ఉన్నాడు. మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమార్తెను సుధాకర్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడనిమృతురాలి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మృతదేహాన్ని పంపించడానికి అల్లుడు నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కలెక్టర్‌ భరత్‌నారాయణగుప్తాను కోరారు.