ఆస్ట్రేలియాలో హత్యకు గురైన డెంటల్ వైద్యురాలు ప్రీతిరెడ్డి కేసులో చిక్కుముడులు వీడటం లేదు. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందన్న విషయమై పోలీసులకు అంతు చిక్కడం లేదు.

హత్యకు రెండు రోజుల ముందు అదృశ్యమైన ప్రీతిరెడ్డి.... ఆమె కారులోనే ఓ సూట్‌కేసులో శవమై తేలారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న మరో భారత సంతతి వైద్యుడు, ఆమె మాజీ ప్రీయుడు హర్ష్ నర్డే... ప్రీతి కోసమే టామ్‌వర్త్ నుంచి 400 కి.మీల దూరంలోని సిడ్నీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు తెలియడంతో దీనిపై ప్రీతితో మాట్లాడేందుకు అతను వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కి.మీల దూరంలో... తన కారు, ఓ ట్రక్‌ను ఢీకొట్టడంతో నర్డే కూడా మరణించాడు.

వీరిద్దరూ ఓ మెడికల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారని, ఉన్నంతసేపు సరదాగానే గడిపారని ఓ సహచరుడు చెప్పినట్లుగా సమాచారం. సదస్సు అయిపోయిన తర్వాత హర్ష్ తన ఫేస్‌బుక్‌లో ఏదో రాశాడని తెలిపాడు.

ఆ తర్వాత కొద్దిగంటలకే ప్రీతిరెడ్డి సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్‌ వద్ద సీసీటీవీలో కనిపించారు. తనకు తెలిసిన ఓ వ్యక్తితోనే అదే హోటల్‌లో ఆమె బస చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రీతిరెడ్డి తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. హోటల్ సీసీటీవీ దృశ్యాల్లో ఆదివారం మధ్యాహ్నాం ఓ పోర్టర్ సాయంతో నర్డే ఓ భారీ సూట్‌కేసును కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు నమోదైనట్లు సిడ్నీకి చెందిన ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రసారం చేసింది.

ప్రీతిరెడ్డి మృతదేహాన్ని అందులోనే ఉంచి ఉండవచ్చని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత ఆమె కోసం విచారిస్తున్న సమయంలోనే ఆదివారం రాత్రి హర్ష్ నర్డే.... ఆమె స్నేహితుల్లో ఒకరికి మెసేజిలు పెట్టినట్లు గుర్తించారు.

ప్రీతిరెడ్డితో తాను శనివారం రాత్రి మాట్లాడానని, ఇంటికి వెళుతున్నట్లు తనకు చెప్పిందని నర్డే పేర్కొన్నాడు. ఆమె అదృశ్యం గురించి అడగ్గా ఎక్కడైనా నిద్రపోతూ ఉండవచ్చని సమాధానమిచ్చాడు. నర్డేకు ఎలాంటి నేర చరిత్ర లేదని అధికారులు తెలిపారు. ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదని న్యూసౌత్‌వేల్స్ పోలీసులు తెలిపారు.