తెలంగాణకు తిరిగొచ్చిన గల్ఫ్ ప్రవాసులు.. శంషాబాద్‌లో స్వాగతం పలికిన కేటీఆర్

First Published 3, Oct 2018, 12:06 PM IST
ktr receives gulf amnesty returnees at shamshabad airport
Highlights

యూఏఈలో ప్రకటించిన అమ్నెస్టీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తెలంగాణకు తిరిగివచ్చిన గల్ఫ్ ప్రవాసులకు మంత్రి కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

యూఏఈలో ప్రకటించిన అమ్నెస్టీ సౌకర్యాన్ని ఉపయోగించుకుని తెలంగాణకు తిరిగివచ్చిన గల్ఫ్ ప్రవాసులకు మంత్రి కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

గల్ఫ్‌లో సరైన వీసాలు లేకుండా వలస వెళ్లిన వారిని యూఏఈ ప్రభుత్వం దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. అయితే తిరిగి భారత్ వచ్చేందుకు టిక్కెట్ల కొనుగోళ్లతో పాటు చిన్న చిన్న జరిమానాలను కూడా చెల్లించేందుకు అక్కడి ప్రవాసాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయాన్ని కొందరు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో.. పరిస్థితిని సమీక్షించడానికి ప్రభుత్వం.. ప్రత్యేక బృందాన్ని యూఏఈ పంపింది. దీనిలో భాగంగా గత వారం రోజులు నుంచి విడతల వారీగా తెలంగాణకి అనేకమంది కార్మికులు చేరుకున్నారు.

దీనిలో భాగంగా నిన్న కొద్దిమంది ప్రవాసులు శంషాబాద్ చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికిన కేటీఆర్... వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్‌లో సరైన వీసాలు లేని వారికి అక్కడ ఎదురువుతున్న పరిస్థితులను వారు మంత్రి దృష్టికి తెచ్చారు.

జరిమానాల విషయంతో పాటు టికెట్లను ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రవాసులకు భరోసా ఇచ్చారు. తిరిగి వచ్చిన వారిని ప్రత్యేక వాహనాలను సమకూర్చి స్వస్థలాలకు పంపాల్సిందిగా ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

అలాగే అమ్నెస్టీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ ఫోన్ నెంబర్ 9440854433ని సంప్రదించాలని కోరారు. తిరిగి వచ్చిన వారికి రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ సంస్థలతో పాటు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ వంటి సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

loader