విషాదాంతం..కాలిఫోర్నియాలో ఎన్నారై ఫ్యామిలీ కిడ్నాప్, విగతజీవులుగా నలుగురు..
కాలిఫోర్నియాలో కిడ్నాప్ కు గురైన సిక్కు కుటుంబం విగతజీవులుగా కనిపించారు. భార్య, భర్త, ఓ చిన్నారి, వారి బంధువు నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శనివారం అపహరణకు గురైన నలుగురు భారతీయ కుటుంబ సభ్యుల కథ విషాదాంతమైంది. నలుగురు విగత జీవులుగా కనిపించారు. ఈ మేరకు కాలిఫోర్నియా పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ’ఇది భయంకరమైన ఘటన.. కిడ్నాపైన ప్రాంతంలోనే నలుగురు భారతీయులు మృతదేహాలను గుర్తించాం. చాలా బాధాకరం’ అని మెర్సిడ్ కౌంటీ పోలీస్ అధికారి వెర్న్ వార్న్ కే అన్నారు. పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ హర్సీపిండ్ కు చెందిన ఈ కుటుంబం కాలిఫోర్నియాలోని మెర్సీడ్ కౌంటీలో కిడ్నాప్ అయింది.
గుర్తుతెలియని వ్యక్తులు భారత సంతతికి చెందిన నలుగురిని అపహరించారు. కిడ్నాపైన వారిలో ఓ ఎనిమిది నెలల పసికందు కూడా ఉంది. అపహరణకు గురైన వారిలో జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (27), చిన్నారి ఆరూహీ ధేరీ, అమన్‌దీప్ సింగ్ (39) ఉండగా వీరిని ఆగంతకులు హతమార్చారు. కుటుంబ సభ్యులలో ఒకరికి చెందిన వాహనం సోమవారం మంటల్లో కాలిపోయి కనిపించింది. దాంతో ఈ నలుగురిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత మెర్సిడ్ కౌంటీలోని అట్ వాటర్ లోని ఓ ఏటీఎం వద్ద బాధితుడి బ్యాంకు కార్డులలో ఒకటి వినియోగించబడిందని మంగళవారం ఉదయం సమాచారం అందింది. దాంతో మెర్సిడ్ కౌంటీ పోలీసులు, డిటెక్టివ్ ల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి
ఈ క్రమంలోనే అపహరణకు గురైన నలుగురు మృతి చెంది కనిపించారు. అయితే, కిడ్నాప్ జరిగిన ప్రదేశం అనేక రెస్టారెంట్లు, షాపులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల ప్రాంతం. అయినప్పటికీ ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు దారి తీస్తుందని పోలీసులు తెలిపారు. నిందితుల గురించి తెలిసినవారు ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని పోలీస్ అధికారి వెర్న్ వార్న్ కే కోరారు.
కాగా, జస్దీప్ తన కుటుంబంతో సెంట్రల్ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన సౌత్ హైవే 59లోని 800 బ్లాక్ వద్ద కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి వీళ్లను అపహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబం కిడ్నాప్కు గురైన మరుసటిరోజే అనుమానితుడు మాన్యుయెల్ సల్గాడోను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణ్ దీర్ సింగ్, కృపాల్ కౌర్ ల స్వస్థలం పంజాబ్. కిడ్నాప్ ఉద్దేశం కచ్చితంగా తెలియదని, కిడ్నాపర్ తాను దొరకకుండా సాక్ష్యాలు, ఆధారాలను నాశనం చేశాడని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడి విచారణలో కారణాలు తెలియాల్సి ఉంది.