రాఖీ పండగ రోజే..ఓ సోదరి కన్నుమూసింది. అలా తమ్ముడికి మెసేజ్ చేసిందో లేదో...అలా చేసిన కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...అమెరికాలోని షికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వివాహిత ఉడత స్వర్ణ(30) దుర్మరణం చెందింది. కూసుమంచికి చెందిన ప్రముఖ వ్యాపారి కూరపాటి రఘునాథరావు చిన్న కూతురైన స్వర్ణను విజయవాడకు చెందిన ఉడత కిరణ్‌కుమార్‌కిచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన కిరణ్‌ ఏడాది క్రితం కుటుంబసభ్యులను తీసుకొని అమెరికా వెళ్లారు. వారాంతపు సెలవు కావడంతో కిరణ్‌, స్వర్ణ, ఇద్దరు కూతుర్లు, స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లారు.
 
తిరిగి వచ్చేటప్పుడు స్వర్ణ కారు నడుపుతుండగా.. వెనకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కారు పల్టీ కొట్టడంతో డ్రైవింగ్‌ చేస్తున్న స్వర్ణకు, ముందు సీట్లో కూర్చున్న స్నేహితురాలికి తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న కిరణ్‌, ఇద్దరు కూతుళ్లకు స్వల్ప గాయాలయ్యా యి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన స్వర్ణ.. 4 గంటల తర్వాత మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోదరుడు సందీప్‌కు ఆన్‌లైన్‌లో రాఖీలు పంపిన స్వర్ణ.. తాను అందుబాటులో లేకపోవడం బాధగా ఉందంటూ ఆదివారం ఉదయం ‘ఐ మిస్‌ యూ రా..’ అంటూ మెసేజ్‌ పెట్టిందని చెబుతూ కుటుంబసభ్యులు రోదించారు.