Asianet News TeluguAsianet News Telugu

కంట తడిపెట్టిన ఎన్నారైలు నాకు తెలుసు: ఎంపీ కవిత (వీడియో)

తెలంగాణ త‌ల్లికి పూల మాల వేసి కవిత వార్షికోత్స‌వాల‌ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి ఎన్నారైల‌కు క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. యూకె, యూఎస్‌ల‌తో మొద‌లైన టిఆర్ఎస్ ఎన్నారై శాఖ‌లు ఇప్పుడు 33 దేశాల‌కు విస్త‌రించాయ‌ని ఆమె ఈ సందర్బంగా చెప్పారు. 

Kavitha at NRI TRS cell annual celebrations
Author
Hyderabad, First Published Jan 12, 2019, 5:52 PM IST

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎన్నారై సెల్ 8వ వార్షికోత్స‌వం హైద‌రాబాద్ లో జ‌రిగింది. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ల వ్య‌వ‌హారాల‌ను చూస్తున్న క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. 

తెలంగాణ త‌ల్లికి పూల మాల వేసి కవిత వార్షికోత్స‌వాల‌ను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి ఎన్నారైల‌కు క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. యూకె, యూఎస్‌ల‌తో మొద‌లైన టిఆర్ఎస్ ఎన్నారై శాఖ‌లు ఇప్పుడు 33 దేశాల‌కు విస్త‌రించాయ‌ని ఆమె ఈ సందర్బంగా చెప్పారు. 

రానున్న రోజుల్లో 100 శాఖ‌ల‌ను ఏర్పాటు చేసి, ఆయా దేశాల్లో గులాబీ జెండాల‌ను రెప‌రెప‌లాడిస్తామ‌న్నారు. ఈ ప‌నిలో ఎన్నారై టిఆర్ఎస్ కోఆర్డినేట‌ర్‌ మ‌హేశ్ బిగాల‌తో పాటు ఇత‌ర దేశాల్లో ఉన్న టిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని తెలిపారు. 

 ముఖ్య‌మంత్రి కెసిఆర్ నాయ‌క‌త్వంలో, ఆయ‌న మార్గ‌ద‌ర్శ‌నంలో ప‌నిచేస్తూ...తెలంగాణ ఖ్యాతిని ఇనుమ‌డింప చేయాల‌ని ఎన్నారైల‌కు క‌విత‌ పిలుపునిచ్చారు. 

ఉద్య‌మ  స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌ర్ విదేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారని, ఆయ‌న సూచ‌న‌ల‌తో  విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డ‌లు వివిధ పేర్ల‌తో సంఘాలు పెట్టుకుని ప‌నిచేసిన విషయం తెలంగాణ స‌మాజం మ‌రువ‌ద‌న్నారు. 

                      "

శాఖ‌లు ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ర‌క‌ర‌కాలుగా అవ‌మానాలు, అవ‌హేళ‌న‌లు ఎదుర్కోన్న‌ విష‌యం మ‌నంద‌రికి తెలుసునన్నారు. కంట త‌డి పెట్టిన ఎన్నారైలూ నాకు తెలుసున‌న్నారు. న‌వ్విన నాప చేను పండిన చందంగా తెలంగాణ సాధించుకున్నామని, టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, మ‌ళ్లీ కెసిఆర్ నాయ‌క‌త్వంలో రెండో సారి కూడా అధికారంలోకి వ‌చ్చామ‌ని క‌విత వివ‌రించారు. కెసిఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధిప‌థంలో దూసుకుపోతున్న‌ద‌న్నారు. 

తెలంగాణ దేశానికే ఆద‌ర్శ‌మ‌న్నారు. మ‌న పారిశ్రామిక విధానాన్ని చూసి అమెరికా వాసులు ఇలాంటి పాల‌సీ మా వ‌ద్ద లేద‌న్న విష‌యం తెలంగాణ బిడ్డ‌లుగా మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం అన్నారు. తెలంగాణ ను చూసి, మ‌న‌ ప్రభుత్వ పనితీరు.. రాష్ట్రం అభివృద్ది చెందుతున్న విధానం చూసి మీరు గర్వపడేలా చేస్తామని ఎంపి క‌విత అన్నారు. 

ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యాయ‌ని, త్వ‌రంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నారై పాల‌సీని ప్రక‌టిస్తార‌ని క‌విత తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు, గ‌ల్ఫ్ వంటి దేశాల్లో తెలంగాణ బిడ్డ‌ల స‌మ‌స్య‌లు ఒక్కో ర‌కంగా ఉన్నాయ‌న్నారు. 

అక్క‌డి వారికి, ఇక్క‌డ పార్టీకి వార‌ధులుగా ఎన్నారై సెల్స్ ప‌నిచేయాల‌ని కోరారు. తెలంగాణ ఉద్య‌మ స్ఫూర్తిని వీడ‌కుండా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. మనమంతా కలిసి  పనిచేస్తే దేశానికే కాదు ప్రపంచానికే   తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంద‌ని కవిత అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బేవ‌రేజెస్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ దేవీ ప్ర‌సాద రావు, టిఆర్ ఎస్ ఎన్నారై సెల్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు అనిల్ కూర్మాచ‌లం, టిఆర్ ఎస్ యూకె అధ్య‌క్షులు అశోక్ దూస‌రి, న్యూజిలాండ్ శాఖ కోశాధికారి అభిలాష్ రంగినేని, యూఎస్ ప్ర‌తినిధులు సుధీర్‌, సురేశ్‌, ర‌మేశ్‌, టిఆర్ ఎస్ ఖ‌తార్ ప్ర‌తినిధి అభిలాష్ బండి, సౌత్ ఆఫ్రికా ప్ర‌తినిధి ర‌మ‌ణా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios