సవతి కూతురిని అతి కిరాతకంగా చంపిన తల్లికి.. న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  భారత సంతతికి చెందిన షామదాయ్ అర్జున్(55) అనే మహిళ  2016, ఆగస్టు 19వ తేదీన తన సవతి కూతురిని అతి కిరాతకంగా హత్య చేసింది. ఆశా దీప్ కౌర్ అనే 9ఏళ్ల బాలిక గొంతుపిసికి చంపేసి.. అనంతరం బాత్ టబ్ లో నగ్నంగా బాలికను పడుకోబెట్టి...బాత్రూం డోర్ గడియపెట్టింది.

కాగా... బాలిక తండ్రి తన కూతురి గురించి ఆరా తీయగా.. బాత్రూమ్ లో స్నానం చేస్తోందని తెలిపింది. బాత్రూమ్ లో నుంచి బాలిక గంటలు గడిచినా రాకపోవడంతో.. అనుమానంతో బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూశారు. కాగా... బాలిక బాత్ టబ్ లో నగ్నంగా నిర్జీవంగా పడి ఉంది. బాలిక శరీరంపై పలు చోట్ల గాయాలు కూడా ఉన్నాయి.

ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సవతి తల్లి షామదాయ్ అర్జున్ ని నిందితురాలిగా తేల్చారు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో ఉండగా..తాజాగా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించింది. నిందితురాలికి 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తుూ తీర్పు నిచ్చింది.