భారత సంతతి వధూవరులు.. దక్షిణాఫ్రికాలో మృతి
ఈ జంట ఆదివారం ఇలా విద్యుదాఘాతానికి బలైంది. మొదట బాత్‌రూంలో భార్య కరెంట్ షాక్‌కు గురి కాగా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు.
భారత సంతతికి చెందిన నూతన వధూవరులు దక్షిణాఫ్రికాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతానికి గురై.. వాళ్లు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే...
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో ఉండే జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్‌కు రెండు వారాల క్రితమే పెళ్లైంది. ఇటీవలే హనీమూన్ వెళ్లొచ్చారు. జోహన్నెస్ బర్గ్ వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఆదివారం ఇలా విద్యుదాఘాతానికి బలైంది. మొదట బాత్‌రూంలో భార్య కరెంట్ షాక్‌కు గురి కాగా.. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు.
ఆదివారం మధ్యాహ్నం దంపతులిద్దరూ బాత్‌రూంలో విగతజీవులుగా పడి ఉండడం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్ బాత్‌రూంలోని షవర్ ట్యాప్‌కు విద్యుత్ ప్రసారం కావడంతోనే చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, దంపతుల మృతికి అసలు కారణం ఏంటనేది మాత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని పోలీస్ అధికారి మవేలా మసండో తెలిపారు.
ఇప్పటికే ఈ ఘటనపై జోహన్నెస్ బర్గ్ సిటీ విద్యుత్ శాఖతో కలిసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలే హనీమూన్ వెళ్లొచ్చిన జంట.. ఇలా రోజుల వ్యవధిలోనే కరెంట్ షాక్‌తో చనిపోవడం ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జహీర్ సరాంగ్, నబీల్హా ఖాన్ అంత్యక్రియలు కుటుంబసభ్యుల మధ్య నిర్వహించారు.