రామానుజం పీఠం ఏర్పాటు: భారత సంతతి గణిత శాస్త్రవేత్త విరాళం
భారత సంతతికి చెందిన ప్రముఖ గణితశాస్త్ర ప్రొఫెసర్ వీఎస్ వరదరాజన్, ఆయన భార్య వేద.. అమెరికా యూనివర్సిటీకి, భారత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం 10 లక్షల డాలర్ల విరాళం అందజేశారు. రామానుజం పేరిట పీఠం ఏర్పాటు కోసం ఈ నిధిని వినియోగిస్తారు.
భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్ వీఎస్ వరదరాజన్, ఆయన భార్య వేదలు స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం గౌరవార్థం కాలిఫోర్నియా లాస్ఏంజిల్స్ యూనివర్సిటీ (యూసీఎల్ఎ)కు 10 లక్షల డాలర్లు విరాళం అందజేశారు.
తద్వారా ప్రొఫెసర్ వరదరాజన్ దంపతులు 1900 ప్రారంభంలో గణితశాస్త్రానికి రామానుజం అందించిన సేవలకు తాజాగా గుర్తింపు తీసుకొచ్చారు. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీలో ‘రామానుజం విజిటింగ్ ప్రొఫెసర్‌సిప్’వేదిక ఏర్పాటు చేయడానికి ప్రొఫెసర్ వరదరాజన్ దంపతులు ఈ విరాళం అందజేశారు.
తద్వారా ఆటోమార్ఫిక్ ఫామ్స్, ఖ్వాంటం ఫిజిక్స్ కోర్సుల్లో వరదరాజన్ స్పెషలైజేషన్ కోర్సులకు విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యులను ఆకర్షించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. ప్రొఫెసర్ రామానుజం వేదికను ఏర్పాటు చేసేందుకు కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీ సెనెట్, కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
యూనివర్సిటీ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న సెంటినెంటల్ క్యాంపెయిన్‌లో భాగంగా రామానుజం వేదిక ఏర్పాటు చేస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ల్లోని వివిధ అంశాల్లో ప్రొఫెసర్ వరదరాజన్ అభ్యసించారని యూనివర్సిటీ తెలిపింది. ఈ రెండు అంశాల మధ్య గల సారూప్యతపై రీసెర్చ్ జరిపారని పేర్కొంది.
కలకత్తా యూనివర్సిటీలో మ్యాథమేటిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసిన వరదరాజన్. మద్రాస్ యూనివర్సిటీలో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. జెనోవా యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో హానరరీ డాక్టరేట్ పొందారు.