బ్రిటన్ బిలియనీర్లు మన ‘హిందుజా’లే
మన హిందూజా బ్రదర్స్ మరోసారి యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలో బిలియనీర్లుగా నిలిచారు. ముంబైలోనే జన్మించిన రూబెన్ బ్రదర్స్ తర్వాతీ స్థానంలో నిలిచారు. ఇక్కడ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ వ్యవస్థాపకుడు లక్ష్మీ మిట్టల్ మాత్రం 11వ స్థానానికి పరిమితం అయ్యారు.
లండన్: భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు యునైటెడ్ కింగ్ డమ్‌లో అత్యంత సంపన్నులుగా నిలిచారు. సండే టైమ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో వీరికి తొలిస్థానం దక్కింది. గత ఏడాదితో పోలిస్తే శ్రీ చంద్, గోపి హిందుజాల సంపద 1.356 బిలియన్ డాలర్లు పెరిగి 22 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరింది.
ఇక ముంబైలో జన్మించిన రూబెన్ సోదరులు 1,866 కోట్ల పౌండ్లతో రెండో స్థానంలో నిలిచారని సండే టైమ్స్ రిచ్ లిస్ట్ పేర్కొంది. 2018లో నాలుగో స్థానంలో ఉన్న రూబెన్ సోదరులు ఈ ఏడాది ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది వీరి సంపద 356 కోట్ల పౌండ్లు పెరిగిందని పేర్కొంది.
గత ఏడాది ఈ జాబితాలో టాప్‌గా నిలిచిన రసాయన రంగ దగ్గజం సర్ జిమ్‌రాట్‌క్లిఫ్ ఈ సారి మూడో స్థానంతో సర్దుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఈ జాబితాలో స్థానం సాధించిన తొలి నల్లజాతి మహిళగా వలేరి మోరన్ నిలిచారు.
1914లో ముంబైలో వ్యాపారం ప్రారంభించిన హిందుజాలు ప్రస్తుతం చమురు, గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ, స్థిరాస్థి రంగాల్లో బిజినెస్ లావాదావీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ చంద్ వయస్సు 83 కాగా, గోపి వయస్సు 79. వీరు మొత్తం నలుగురు సోదరులు. కానీ, వీరిలో ఈ ఇద్దరే వ్యాపారాలను చూసుకొంటారు. మరో ఇద్దరు సోదరులు ప్రకాష్, అశోక్ పేర్లు వ్యాపార కార్యకలాపాల్లో వినిపించవు.
యునైటెడ్ కింగ్‌డంలో హిందూజా గ్రూప్ కంపెనీలను నిర్వహిస్తున్న శ్రీచంద్, గోపీచంద్ హిందూజాల సంపద గత ఏడాదితో పోల్చితే 135 కోట్ల పౌండ్లు పెరిగిందని సండే టైమ్స్ పేర్కొంది. గతంలో 2014, 2017లలో కూడా సండే టైమ్స్ జాబితాలోనూ వీరు స్థానం సంపాదించారు.
హిందూజా గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న 79 ఏళ్ల జీపీ హిందూజా.. బ్రిటన్‌లోనే నివసిస్తూ.. స్వదేశమైన భారత్‌లోని తన కుటుంబ సభ్యులతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారని తెలిపింది. లండన్ ప్రధాన కేంద్రంగా హిందూజా గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తోంది.
బ్రిటన్‌లో సోదరుడు శ్రీచంద్ హిందూజాతో కలిసి జీపీ హిందూజా వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తుండగా మరో ఇద్దరు సోదరులు ప్రకాశ్, అశోక్ హిందూజాలు.. జెనీవా, ముంబైల్లో సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
హిందూజా గ్రూప్ నిర్వహణలో మొత్తం 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీలు 2018లో దాదాపు 4,000 కోట్ల పౌండ్ల టర్నోవర్‌ను నమోదు చేసినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ తెలిపింది.
2006లో క్వీన్ ఎలిజబెత్ 2 నుంచి కార్ల్‌టన్ హౌస్ టెర్ర్‌సలో నాలుగు ఇంటర్‌కనెక్టడ్ లండన్ హోమ్స్‌ను హిందూజా కుటుంబం కొనుగోలు చేసిందని తెలిపింది. సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన వీరు ఇప్పటికి మాంసాహారం, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారని పేర్కొంది.
యూరప్‌లోని దాదాపు 1000 మంది సంపన్నులను విశ్లేషించి ఈ జాబితాను తయారు చేశారు. బ్యాంక్ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను మాత్రం లెక్కలోకి తీసుకోరు. హిందుజా ఆటోమోటీవ్‌కు లాభాలు రావడం, నార్త్‌యార్క్‌షైర్ బస్ తయరీ సంస్థ ఒపెట్రె లాభాలు కూడా 50శాతం పెరిగాయి.
భారత సంతతి బిలీయనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ సంపద గత ఏడాది ఏకంగా 399 కోట్ల పౌండ్లు హరించుకుపోయిందని వెల్లడించింది. దీంతో 2018లో ఐదో స్థానంలో ఉన్న ఆయన ఈ ఏడాది 11వ స్థానానికి పడిపోయారని తెలిపింది.
ఇదే సమయంలో అనిల్ అగర్వాల్ సంపద విలువ 8.72 బి.పౌండ్లు పెరిగి 10.57 బి.పౌండ్లకు చేరడంతో, 12వ స్థానం దక్కించుకున్నారు.45 మంది భారతీయ కుబేరులకు ఈ జాబితాలో చోటు లభించింది. జౌళి-ప్లాస్టిక్ పరిశ్రమల యజమాని శ్రీప్రకాశ్ లోహియాకు 26వ స్థానం, లార్డ్ స్వరాజ్ పాల్‌కు 69వ స్థానం, సునీల్ వశ్వానీ 75వ స్థానం లభించాయి.