అమెరికాలో గుంటూరుకు చెందిన టెకీ మృతి.. ట్రెక్కింగుకు వెళ్లి..200 అడుగుల లోయలో పడి..
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఓ టెకీ అమెరికాలో మృతి చెందాడు. సెలవుల్లో సరదాగా గడుపుదామని ట్రెక్కింగ్ కు వెళ్లి.. ప్రమాదవశాత్తు 200 అడుగుల లోయలో పడి మృత్యువాత పడ్డాడు.
అమెరికా : అమెరికాలో ట్రెక్కింగుకు వెళ్లి ప్రమాదవశాత్తు తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడు తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లి లోయలో పడి మరణించాడు. ఈ దారుణ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతుడు గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ గా గుర్తించారు. గుంటూరు వికాస్ నగర్ కు చెందిన సీనియర్ టీడీపీ నేత సుఖవాసి శ్రీనివాస రావు అల్లుడు గంగూరి శ్రీనాథ్. సుఖవాసి శ్రీనివాస రావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్ర నగర్ కు చెందిన శ్రీనాథ్ కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.
ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. గత ఆరేళ్లుగా ఫ్లోరిడాలో పనిచేస్తున్న శ్రీనాథ్ సెలవులపై తన స్నేహితులతో కలిసి అట్లాంటా వెళ్లినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆదివారం సెలవు కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు భార్యభర్తలు అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్ లెన్స్ మౌంటెన్ హిల్స్ లో ఎత్తైన ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 200 అడుగుల కింద పడిపోయాడు. తలకు గాయాలు కావడంతో శ్రీనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య.. బ్లాక్ మెయిల్ చేశాడు, అందుకే చంపానంటున్న నిందితుడు…
అంత్యక్రియల నిమిత్తం భౌతికకాయాన్ని గుంటూరుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనాథ్ అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో మాస్టర్స్ చేశారు. అతను మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. కుమారుడు మృతి వార్త విన్న తల్లిదండ్రులు బాబురావు, మల్లీశ్వరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్ మేదరమెట్ల, అశోక్ కొల్లా, సరేష్ కాకర్ల బాధిత కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.
ఇదిలాఉండగా, అక్టోబర్ 11న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కెనడా లో ఉండే ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మెకానికల్ ఇంజనీరు నెక్కలపు హరీష్ చౌదరి (35) కుటుంబం విజయవాడ శివారులోని పోరంకిలో ఉంటుంది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పదేళ్లక్రితం కెనడాలోని ఆంటారియోకి వెళ్ళిన హరీష్ అక్కడ ‘టూల్ డిజైనర్ గా’ పని చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సాయి సౌమ్యతో వివాహమైంది.
ప్రకృతి ప్రేమికుడైన హరీష్ విహారయాత్ర కోసం ఈనెల 8న ఐదుగురు స్నేహితులతో కలిసి అమెరికా వెళ్లారు. 11న న్యూయార్క్ లోని ఇతాకా జలపాతం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫోటో దిగుతూ వెనక్కి జారిపడి నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందారు. ‘తానా’ సహకారంతో మృతదేహాన్ని స్వస్థలం చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.