ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. ఆమె వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న అనసూయదేవి అమెరికాలోని హ్యూస్టన్‌లో తుదిశ్వాస విడిచారు.

1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు ఆమె విశేష ప్రాచుర్యం కల్పించారు.

జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడటంలో అనసూయదేవికి మంచి పట్టుంది. అలాగే హర్మోనియం వాయించడంలో సిద్ధహస్తురాలు. జానపద, శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయంల నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్ అందుకున్నారు. అనసూయదేవికి ఐదుగురు సంతానం. 

అనసూయా దేవి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనటంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలను కొనియాడారు. రేడియో వ్యాఖ్యాతగా అనసూయా దేవి సుపరిచితురాలని, ఆమె కుటుంబసభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.