అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో మిచిగాన్ వద్ద ఆగి ఉన్న కారును అతివేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు కారులో ఉన్న ఎల్ల చరితారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని రేణుకానగర్‌కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు.  8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. మిచిగాన్‌లో ఉంటున్న ఆమె.. వీకెండ్‌ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. 

మిచిగాన్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు.

 ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఈ విషయంలో మంత్రి ఈటల రాజేందర్‌ చొరవ తీసుకున్నారన్నారు. ప్రమాదం ముందురోజే తన సోదరి తమతో మాట్లాడిందని, హెచ్‌వన్‌ వీసా రాకపోతే హైదరాబాద్‌ వచ్చేస్తానని చెప్పిందని యశ్వంత్‌రెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు.