వాషింగ్టన్‌: విదేశీ ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించే హెచ్‌-1బీ వీసా నిబంధనలు మరింత సంక్లిష్టం చేసే పనిలో భాగంగా ట్రంప్‌ సర్కార్‌ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది హెచ్‌-1బీ వీసాలకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ వీసాలు జారీ చేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానికులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

‘ప్రతి ఏడాదీ హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటే కంపెనీలకు మేలు జరుగుతుంది. పనిలో నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా అమెరికా పౌరులకు సైతం ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నాం.’ అని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్‌ నీల్సన్‌ తెలిపారు.

అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలన్నీ భారత్, చైనాలకు చెందిన వేల మంది ఐటీ నిపుణులపైనే ఆధారపడి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా నిపుణులు అందుబాటులో లేకపోతే, వారికి తగిన శిక్షణ ఇచ్చే వరకు మాత్రమే హెచ్-1 బీ వీసాదారులకు అవకాశం కల్పించాల్సి ఉంటుందని అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు క్రిస్టెన్ నీల్సన్ చెప్పారు. ప్రతియేటా పరిమితికి మించి హెచ్-1బీ వీసా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో పనిచేసేందుకు అత్యుత్తమ నిపుణులను ఎంచుకోవాలని నిర్ణయించామన్నారు. హెచ్-1బీ వీసా విధానం దుర్వినియోగం చేస్తున్నందు వల్లే కఠినతరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత చట్టంలో గల లోసుగులను తొలగించి స్థానికులకు ఉపాధి కల్పనకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. 

అనునిత్యం అమెరికా అధ్యక్షుడు ‘అమెరికా వస్తువులు కొనండి.. అమెరికన్ ను నియమించుకోండి’ అని జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ విధాన నిర్ణయాలు, ప్రాధాన్యాల్లో సమతుల్యత పాటిస్తూనే హెచ్-1బీ వీసాల జారీకి చర్యలు చేపడతామని  హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్‌ నీల్సన్‌ తెలిపారు.