Asianet News Telugu

ఎన్నారైలకు శుభవార్త...గ్రీన్ కార్డ్ నిబంధనల మార్పుపై ముందడుగు

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూసే పరిస్థితి ఇకనుంచి తప్పిపోనున్నది. ఇప్పటివరకు దేశాల వారీగా అమలు చేసిన కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్, సెనెట్‌లలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే చట్టం అవుతుంది. దీనివల్ల భారతీయ నిపుణులకు ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డు పొందే వెసులుబాటు లభిస్తుంది. 
 

Bills introduced in House and Senate to remove per-country green card limits
Author
USA, First Published Feb 9, 2019, 10:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న ఇండియన్లకు శుభవార్త. గ్రీన్‌కార్డుల జారీలో వివిధ దేశాలకు కేటాయించే కోటాను ఎత్తివేసే దిశగా ముందడుగు పడింది. దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన బిల్లు తాజాగా అమెరికా కాంగ్రెస్‌ ముందుకువచ్చింది.

ఉద్యోగం ఆధారంగా జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ ఫేర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ బిల్లును సెనేట్‌లో రిపబ్లిక్‌ సభ్యుడు మైక్‌ లీ, డెమోక్రటిక్‌ సభ్యురాలు కమలా హారిస్‌ ప్రవేశపెట్టారు. ‘అవర్స్ ఈజ్ ఎ నేషన్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. అండ్ అవర్ స్ట్రెంత్ హాజ్ ఆల్వేస్ కం ఫ్రం అవర్  డైవర్సిటీ అండ్ అండ్ యూనిటీ’ అని కమలా హరిస్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత పేర్కొన్నారు.

ఇక ప్రతినిధుల సభలోనూ సభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా కాంగ్రెస్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే.

హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది భారతీయులు దేశాల కోటా వల్ల గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కోటాను తీసేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తే భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.

ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తోంది. వీటిలో ఏ దేశానికి ఏడు శాతానికి మించి కేటాయించదు. ఈ పరిమితి వల్ల మిగతా దేశాలకు చెందిన వారితో పాటు భారత్‌, చైనాకు చెందిన వ్యక్తులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

చైనా, భారత దేశాల నుంచి గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటుంది. తాజా బిల్లు అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లులకు సిలికాన్ వ్యాలీలోని గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు, అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ వంటి కార్పొరేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. 

ఇంకా ఇమ్మిగ్రేషన్ వాయిస్, కంపీట్ అమెరికా కోలియేషన్, ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్, వాల్ మార్ట్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్, ది హెరిటేజ్ ఫౌండేషన్, లా రాజా తదితర సంస్థలు కూడా బాసటగా నిలిచాయి. 

ఇమ్మిగ్రేషన్ వాయిస్ సహ వ్యవస్థాపకురాలు, ప్రెసిడెంట్ అమన్ కపూర్ స్పందిస్తూ బిల్లును స్వాగతించారు. అత్యున్నత నిపుణులు వచ్చి అమెరికాలో కంపెనీలు ప్రారంభించి స్థానికులకు ఉపాధి కల్పించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. అత్యున్నత స్థాయి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో వివక్షకు చరమ గీతం పాడినట్లవుతుందని అమన్ కపూర్ వ్యాఖ్యానించారు. 

ఇప్పటివరకు అమలులో ఉన్న పాలసీ వల్ల హెచ్1 బీ వీసా కింద అమెరికాకు వచ్చిన భారతీయుల్లో కొందరు శాశ్వత సభ్యత్వం లేదా గ్రీన్ కార్డు కోసం ప్రస్తుత వ్యవస్థలో 151 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుందేమోనని ఇటీవలి సర్వేలో అభిప్రాయ పడ్డారు. 

సెనెట్‌లో ఈ బిల్లుకు 13 మంది సెనెటర్లు మద్దతునిస్తున్నారు. వివక్షకు చరమగీతం పలికి కుటుంబాలను ఐక్యం చేసేందుకు, అత్యున్నత నిపుణులైన ఇమ్మిగ్రెంట్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా చూసుకోవాలి’ అని ఇండో అమెరికన్ సెనెటర్ కమలా హరిస్ వ్యాఖ్యానించారు. దేశం, మూలాలు ఆధారంగా ఇమ్మిగ్రెంట్లు జరిమానా విధించే పరిస్థితి రాకూడదని రిపబ్లికన్ సెనెటర్ మైక్ లీ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios