యూకేలో ఘనంగా బతుకమ్మ జాతర సంబరాలు
ఆడపడుచులకు లక్ష్మీపూజతో ఆరంభమైన ఈ కార్యక్రమం పిల్లలకు బహుమతి ప్రదానోత్సవంతో ఊపందుకుంది. ఆడపడుచులు, పిల్లలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే వస్త్రధారణతో బతుకమ్మలను మైమరిపించారు. పాటలు, కోలాటాలతో ప్రాంగణమంతా పరవశించిపోయింది. ఆ తరువాత అందరూ కలిసి సంప్రదాయ రుచులతో విందుభోజనాన్ని ఆరగించారు.
‘రీడింగ్ బతుకమ్మ జాతర’ ఆధ్వర్యంలో రీడింగ్ పట్టణంలో ఆదివారం రోజున బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 600 మందికిపైగా వచ్చిన అతిథులతో సంబరాలు అంబరాన్నంటాయి.
నెల రోజుల ముందునుండే ఈ బతుకమ్మ సంబరాలకోసం ప్రెసిడెంట్ విశ్వేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, టీం రమేష్, నటరాజ్, చైతన్య, రఘు, శ్రీనివాస్, రాంరెడ్డి సారథ్యంలో సన్నాహక కార్యక్రమాలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు పిల్లలకు అందజేయాలని, వారిలో ఆ అసక్తిని పాదుకొల్పడానికి చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, ఆటలు మొదలగు పోటీలు నిర్వహించారు.
ఇతర తెలుగు, భారతీయ సంఘాలన్నింటికి ఆహ్వానాలు అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది ఆడపడుచుల చేత బతుకమ్మలని చేయించడానికి కావల్సిన సరంజామా అందే ఏర్పాట్లు చేసుకున్నారు. హెచ్‌డిఎఫ్‌సి, ఎంపవర్, వెల్త్‌మాక్స్, ఎక్సెల్ రెనొవేషన్స్, కుషాల్ జువెలరీ, స్పైసీ హైదరాబాద్, శివి రైస్, యప్ టీవీ లాంటి సంస్థలనుండే కాకుండా ఎందరో స్వచ్ఛంద దాతలనుండి ఆర్థికవనరులను సమకూర్చుకున్నారు. వేదికని సర్వాంగసుందరంగా ముస్తాబు చేసుకున్నారు.
ఇక ఆదివారం రోజు ముందుగా ఆడపడుచులకు లక్ష్మీపూజతో ఆరంభమైన ఈ కార్యక్రమం పిల్లలకు బహుమతి ప్రదానోత్సవంతో ఊపందుకుంది. ఆడపడుచులు, పిల్లలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే వస్త్రధారణతో బతుకమ్మలను మైమరిపించారు. పాటలు, కోలాటాలతో ప్రాంగణమంతా పరవశించిపోయింది. ఆ తరువాత అందరూ కలిసి సంప్రదాయ రుచులతో విందుభోజనాన్ని ఆరగించారు. ఆనందంగా బతుకమ్మ ఆటలు ఆడాక బతుకమ్మలకు ఘనంగా నిమజ్జనం చేశారు.TENF వేణు గంప, TDF శ్రీనివాస్, గౌడ్, టాక్ కార్యదర్శి మాల్లా రెడ్డి - శుషుమ్న దంపతులు, తదితర సంఘాల ప్రెసిడెంట్స్ విచ్చేసి చేయూతను అందజేశారు.