వాషింగ్టన్ డీసీ: అమెరికా తెలుగు సంఘం తానా సభల్లో బిజెపి నేత రామ్ మాధవ్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్‌ డీసీలో మూడు రోజులపాటు సాగిన తానా 22వ మహాసభలు స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం సంగీత విభావరితో ముగిశాయి. 

తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ పద వీ కాలం ముగిసింది. తదుపరి అధ్యక్షుడిగా తెలంగాణలోని ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్‌కు బాధ్యత అప్పగించారు. ఈ సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలుగువారంత ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలోకి రావాలని ఆయన తన ప్రసంగంలో కోరారు. 

ఆ తర్వాత దేశంలో మోదీ హయాం లో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన చెప్పడం ప్రారంభించారు. దాంతో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవాసాంధ్రులు అడ్డుతగిలారు. ఈలలు, కేకలు వేస్తూ రాంమాధవ్‌ వేదిక మీద నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. 

దీంతో ఆయన తన ప్రసంగాన్నిమధ్యలోనే ముగించి వెనుదిరిగారు. ఈ వేడుకలకు రికార్డుస్థాయిలో దాదాపు 25 వేల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. సభలకు పిలిచి రామ్ మాధవ్ పట్ల అనుచితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.