Asianet News TeluguAsianet News Telugu

మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఫెడెక్స్ కు భారత సంతతి సీఈవో..

భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మరో భారతీయ సంతతి వ్యక్తి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఫెడెక్స్ కు సీఈఓ గా నియమితులయ్యారు.

another indian american has joined the list of top CEOs
Author
Hyderabad, First Published Mar 29, 2022, 12:36 PM IST

వాషింగ్టన్ :  అంతర్జాతీయ  దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న  భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రముఖ కొరియర్ డెలివరీ సంస్థ FedExకు భారతీయ అమెరికన్ అయిన రాజ్ సుబ్రమణియంను సీఈఓగా నియమిస్తున్నట్టు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న CEO, చైర్మన్ ఫ్రెడెరిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1 నుంచి ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా కొనసాగనున్నారు. స్మిత్ స్థానంలో సుబ్రమణియం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

‘మున్ముందు సంస్థను విజయతీరాలకు చేర్చడంలో సుబ్రమణియం సమర్థతపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని స్మిత్ తెలిపారు. ఫెడెక్స్ ను స్మిత్ 1971లో స్థాపించారు. ‘ఫ్రైడ్ ఒక గొప్ప దార్శనికత గల నాయకుడు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప సంస్థను స్థాపించారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని సుబ్రమణియం అన్నారు. అమెరికాలోని టెన్నెసీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో ఆరు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

2020లో సుబ్రమణియం తొలిసారి ఫెడెక్స్ బోర్డులోకి ప్రవేశించారు. ఇక మీదట బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఫెడెక్స్  ఎక్స్ ప్రెస్ అధ్యక్షుడు, సీఈవోగా పనిచేశారు. అలాగే ఫెడెక్స్ కు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా, చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఇలా సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాల్లో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉండడం విశేషం. 

కేరళలోని తిరువనంతపురానికి చెందిన సుబ్రమణియం ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం న్యూయార్క్ లోని సిరక్యూస్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా పుచ్చుకున్నారు. 

ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు సీఈవోలుగా ఉన్న భారత సంతతి వ్యక్తులు వీరే...

సుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్
సత్య నాదెళ్ల - మైక్రో సాఫ్ట్
పరాగ్ అగర్వాల్ - ట్విటర్
అర్వింద్ కృష్ణ - ఐబీఎం 
లీనా నాయర్ - ఛానెల్
శంను నారాయణ్ - అడోబ్
సంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్
నికేష్ అరోరా - పాలో ఆల్టో నెట్ వర్క్స్
జార్జ్ కురియన్ - నెట్ యాప్
రేవతి అద్వైతి - ఫ్లెక్స్ (గతంలో ఫ్లెక్సాట్రానిక్స్)
అంజలి సుద్ - విమియో
జయశ్రీ ఉల్లాల్ - అరిస్టా నెట్ వర్క్స్
రంగరాజన్ రఘురామ్ - వీఎంవేర్

Follow Us:
Download App:
  • android
  • ios