అమెరికాలోని స్కూల్‌లో కాల్పులు.. 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన ఏపీ టీచర్..
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుడు శ్రీధర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇందుకు కారణం పాఠశాలలో కాల్పులు జరుగుతున్న సమయంలో వెంటనే అప్రమత్తమై.. 20 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడటమే.
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుడు శ్రీధర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇందుకు కారణం పాఠశాలలో కాల్పులు జరుగుతున్న సమయంలో వెంటనే అప్రమత్తమై.. 20 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడటమే. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలోని టాంగిల్‌వుడ్ మిడిల్ స్కూల్‌లో చోటుచేసుకుంది. మార్చి 31న పాఠశాలకు ఆయుధం తీసుకొచ్చిన 12 ఏళ్ల విద్యార్థి మరో విద్యార్థి (12)ని కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగిన ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్. వెంటనే అప్రమత్తమయ్యారు. వేగంగా స్పందించారు. అతని క్లాసుకు చెందిన 20 మంది విద్యార్థులను సురక్షితంగా ఉంచారు.
మచిలీపట్నంకు చెందిన శ్రీధర్ ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. గత మూడేళ్లుగా టాంగిల్‌వుడ్ మిడిల్ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్లాసులు మార్చే సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పుల్లో మరణించిన 12 ఏళ్ల జమారీ కోర్టేజ్ బోనపార్టే జాక్సన్.. శ్రీధర్ విద్యార్థి. అయితే కాల్పలు జరిగిన సమయంలో బోనపార్టే.. శ్రీధర్ వద్ద లేడు. జాన్సన్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి కూడా 7వ తరగతి చదువుతున్నాడు. అయితే అతడు శ్రీధర్ విద్యార్థి కాదు.
ఈ ఘటనతో అప్రమత్తమైన శ్రీధర్.. 20 మందికి పైగా విద్యార్థులను క్లాస్‌రూమ్‌లోకి వేగంగా రప్పించారు. కాల్పులు జరిపిన వ్యక్తి క్లాస్ రూమ్‌లోకి రాకుండా.. బెంచీలతో తలుపులు మూసేశాడు. ఈ ఘటనకు సంబంధించి శ్రీధర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘నాకు కాల్పుల శబ్దం వినిపించినప్పుడు.. వేగంగా చర్యను ప్రారంభించాలని అనుకున్నాను’ అని తెలిపారు.
శ్రీధర్‌లాగే పలువురు ఉపాధ్యాయులు కూడా 150 మందికి పైగా విద్యార్థులను హాలులో నుంచి తరగతి గదుల్లోకి తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అంచనా వేయడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక, ఏప్రిల్ 1న పాఠశాలకు ఐచ్ఛిక సెలవు ఇచ్చినా శ్రీధర్ పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది తాను పనిచేస్తున్న పాఠశాలకు, అధికారులకు నైతిక మద్దతునిచ్చేందుకు తీసుకున్న నిర్ణయమని శ్రీధర్ చెప్పారు.
కాల్పులకు పాల్పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు గ్రీన్‌విల్లే కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది. నిందితుడి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. కాల్పులకు గల ఉద్దేశ్యం తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. బాధితుడు, నిందితుడు ఇద్దరు ఒకరికొకరు సుపరిచితులని పరిచయస్తులే అని గుర్తించామని పేర్కొంది. ఈ ఘటనలో విద్యార్థులు గాయపడినట్టుగా వెల్లడించింది.