భారతీయులు వేసిన దొంగ ఓట్ల వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానంటూ అమెరికాకు చెందిన అభ్యర్ధి ఒకరు చేసిన పోస్ట్‌పై దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లోని పలు టౌన్‌షిప్పులకు ఎన్నికలు జరిగాయి.

ఈ క్రమంలో గత నవంబర్‌లో చెస్టర్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌కు జరిగిన ఎన్నికల్లో శామ్ డేవిస్ అనే అమెరికన్.. భారత సంతతికి చెందిన శ్రీకాంత్ ధోప్తే చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి భారంతో కుంగిపోయిన ఆయన ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

‘‘న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో నివసిస్తున్న భారతీయులు దొంగ ఓట్లు వేయడం వల్లే తాను ఓడిపోయానని, వారందరికీ 15 వేల డాలర్లు జరిమానా విధించేదాకా తాను నిద్రపోనంటూ పోస్ట్ చేశారు. దీనిపై ఇండియన్స్ మండిపడ్డారు.

శామ్ జాత్యహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపొందిన శ్రీకాంత్ సైతం శామ్ ఆరోపణలు ఖండించారు. ఇది ఖచ్చితంగా జాత్యహంకార చర్యేనని, రిపబ్లిక్ పార్టీ చేస్తామని ప్రకటించిన సంస్కరణలు నచ్చకపోవడం వల్లే అక్కడి తెల్లవాళ్లు సైతం వారికి ఓటేయలేదని, అందుకే శామ్ ఓడిపోయారని శ్రీకాంత్ పేర్కొన్నారు.