సౌదీలో హైదరాబాద్ మహిళ మృతి
మొదట పంపిస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత నుంచి హింసించడం మొదలుపెట్టారు. అవి తట్టుకోలేక మా అమ్మ చనిపోయి ఉంటుంది’ అని బాధితురాలి కూతురు పేర్కొంది.
హైదరాబాద్ కి చెందిన మహిళ(41).. సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడింది. ఉద్యోగం కోసం వలస వెళ్లిన ఆ మహిళ మృత్యువాతపడటం ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. యజమానే ఆమెను హత్య చేసి ఉంటాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని భారత్ కి వచ్చేలా చేయమని కోరారు.
మృతురాలి కూతురు మీడియాతో మాట్లాడుతూ.. ‘ నెలకు రూ.20వేలు జీతం ఇచ్చేలా ఉద్యోగం ఇస్తామని మధ్యవర్తి ఒకరు చెప్పారు. ఆ ఒప్పందం మేరకు మా అమ్మ 2016 డిసెంబర్ లో అక్కడికి వెళ్లింది. ముందు ఆమెను దుబాయి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి సౌదీకి పంపారు. అక్కడ అమ్మ కొందరి ఇళ్లల్లో పనిమనిషిగా, పిల్లల కేర్ టేకర్ గా పనిచేసింది. కానీ ఇస్తామన్న జీతం ఇవ్వలేదు. నెలకు రూ.16వేలు మాత్రమే ఇచ్చారు’ అని తెలిపింది.
‘‘గత జులై నుంచి అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. తనను ఇండియా పంపించాల్సిందిగా తన యజమానికి కోరింది. మొదట పంపిస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత నుంచి హింసించడం మొదలుపెట్టారు. అవి తట్టుకోలేక మా అమ్మ చనిపోయి ఉంటుంది’ అని బాధితురాలి కూతురు పేర్కొంది.