తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి  ఇద్దరు ఎన్ఆర్ఐలు భారీ విరాళం ప్రకటించారు. భారత సంతతికి చెంది.. అమెరికాలో స్థిరపడిన ఇద్దరు వ్యక్తులు.. స్వామి వారి ఆలయానికి రూ.14కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు స్వయంగా వెల్లడించారు.

శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వారు ఈ విరాళాన్ని ఆలయానికి ఇచ్చారు. ఆ ఇద్దరు ఎన్ఆర్ఐలు స్నేహితులని ఆలయ అధికారులు చెప్పారు. వారి కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఆలయానికి వచ్చి... రూ.14కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్ ని ఆలయ అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు. 

ఈ నగదుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే  ప్రజా సంక్షమ పథకాల కోసం వినియోగించాలని కోరారు. వీరు ఇలా ఆలయానికి నగదు ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. గతేడాది జులైలో ఈ ఇద్దరు స్నేహితులు రూ.13.5కోట్లు స్వామి వారి ఆలయానికి అందజేశారు. ఈ సంవత్సరం రూ.14కోట్లు అందజేశారు.