న్యూఢిల్లీ: అమెరికా అభివృద్ధిలో భారత సంతతి పౌరుల పాత్ర ఎనలేనిదని సీఐఐ తాజా సర్వే తేల్చింది. భారతీయులు, ఇక్కడి మూలాలు కలిగినవారి సంస్థలు.. అగ్రరాజ్య అభ్యున్నతికి దోహదపడుతున్న తీరును ఈ సర్వే ఆవిష్కరించింది.

అమెరికాలో 155 భారతీయ సంస్థలు రూ.1.68 లక్షల కోట్ల (22 బిలియన్‌ డాలర్లకుపైగా) పెట్టుబడులు పెట్టాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం (సీఐఐ) తెలిపింది. అమెరికా వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు సుమారు 1.25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయని వెల్లడించింది.

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌సహా చాలా దేశాలు అమెరికాకు ఏమీ చేయడం లేదని తరచూ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో సీఐఐ నిర్వహించిన ఈ సర్వే మిక్కిలి ప్రాధాన్యం సంతరించుకున్నది.

‘అమెరికా మట్టిలో భారతీయ మూలాలు 2020’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న ఈ 155 భారతీయ సంస్థల ద్వారా ఉద్యోగాలు పొందిన టాప్‌-5 అమెరికన్‌ రాష్ర్టాల్లో టెక్సాస్‌ (17,578), కాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ  (8,057), న్యూయార్క్‌ (6,175), ఫ్లోరిడా (5,454) ఉన్నాయి. 

టెక్సాస్‌లో అత్యధికంగా 9.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను భారతీయ కంపెనీలు పెట్టాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో 2.4 బిలియన్‌ డాలర్లు, న్యూయార్క్‌లో 1.8 బిలియన్‌ డాలర్లు, ఫ్లోరిడాలో 915 మిలియన్‌ డాలర్లు, మసాచుసెట్స్‌లో 873 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని సర్వే తెలిపింది. 

ఇండియన్ల సంస్థల దృష్టి ఎక్కువగా న్యూజెర్సీ, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, జార్జియా రాష్ర్టాలపైనే ఉందని కూడా సర్వేలో తేలింది. ఔషధ, లైఫ్‌ సైన్సెస్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఆర్థిక సేవలు, తయారీ, పర్యాటక, ఆతిథ్యం, డిజైన్‌, ఇంజినీరింగ్‌, ఆటోమోటివ్‌, ఆహార, వ్యవసాయ, ఇంధన, గనులు, మెటీరియల్స్‌ రంగాల  సంస్థలు తాజా సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.

77 శాతం సంస్థలు అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు యోచిస్తుండగా, 83 శాతం కంపెనీలు రాబోయే ఐదేండ్లలో స్థానికులకు ఇంకా ఉద్యోగావకాశాలను కల్పించాలని చూస్తున్నాయి.

also read:ఫోకో ఎక్స్2కు గట్టిపోటీ: విపణిలోకి మోటరోలా వన్ ఫ్యూజిన్ ప్లస్

‘భారతీయ సంస్థల కోసం మరింత అనువైన వాతావరణాన్ని, అనుకూల విధానాలను అమెరికా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నది. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇప్పుడిది ఎంతో ముఖ్యం’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అని పేర్కొన్నారు.

అమెరికాలో భారత రాయబారి తరన్జిత్‌ స్పందిస్తూ.. ‘అమెరికాలో భారతీయ పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నది. పరిశోధన, అభివృద్ధి రంగాల్లోనూ భారత్‌ పెట్టుబడులు ఉండటం గమనార్హం’ అని వ్యాఖ్యానించారు.