కళ్లుపీకేసి.. ఎముకలు విరిచేసి తల్లి హత్య... ఎన్ఆర్ఐ దంపతుల అరెస్ట్
నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు.
నవ మోసాలు మోసి, కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లి పట్ల ఓ కొడుకు రాక్షసంగా ప్రవర్తించాడు. భార్యతో కలిసి తల్లి పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె కంటి దగ్గర నరాలను కత్తిరించి.. శరీరంలోని పలు ఎముకలను విరిచేసి... చివరకు వాటిని తట్టుకోలేక ఆమె చనిపోయేటట్లు చేశారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి.... జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా... నిందితులు భారతీయులు కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.... భారత్ కి చెందిన ఓ వ్యక్తి కి భార్య,కుమార్తె ఉంది. ఉద్యోగ రీత్యా వారు దుబాయిలో స్థిరపడ్డారు. భార్య, భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో... కుమార్తెను చూసుకోవడం కష్టమైంది. దీంతో... ఇండియా నుంచి అతను తన తల్లిని తీసుకువచ్చాడు. అయితే... కుమార్తెను సరిగా చూసుకోవడం లేదనే భావన భార్యభర్తలిద్దరిలోనూ ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడూ వారి పొరిగింటివారికి చెబుతూ ఉండేవారు.
అయితే... ఆమెకు ఇండియా నుంచి తీసుకువచ్చినా లాభం లేదని భావించిన ఆ దంపతులు తల్లిని హింసించడం మొదలుపెట్టారు. కనీసం తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదు. చనిపోయే సమయానికి ఆమె బరువు కేవలం 29 కేజీలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కట్టుకోవడానికి మంచి దుస్తులు కూడా లేకుండా చేసేవారు. ఒంటిపై వాతలు పెట్టేవారు. కంటి దగ్గర నరాలు పీకేసారు. ఎముకలు విరిచేశారు.
శరీరంలోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బాల్కనీలో ఓ శవంలా పడి ఉన్న ఆమెను పొరిగింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా... చనిపోయినట్లు తెలిపారు. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఆమె శరీంలోని దాదాపు ఎముకలన్నీ విరిగిపోయాయని చెప్పారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన ఆ వ్యక్తిని, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు పోలీసు కస్టడీలో ఉన్నారు.