‘వాన్నా క్రై’లా ‘బ్లూకీప్’తో మాల్వేర్ థ్రెట్: మైక్రోసాఫ్ట్ వార్నింగ్
కంప్యూటర్ సిస్టమ్స్‌పై రెండేళ్ల క్రితం ‘వాన్నా క్రై’వైరస్ దాడి చేసినట్లు తాజాగా ‘బ్లూ కిప్’వైరస్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నదని టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
అంతర్జాతీయంగా దాదాపు పది లక్షల కంప్యూటర్ల మీద మాల్‌వేర్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించిందని ఓ మీడియా కథనం పేర్కొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2017లో ఇలాగే ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లపై దాడి చేసిన మాల్‌వేర్ ‘వాన్నాక్రై’వల్ల కొన్ని బిలియన్ డాలర్ల నష్టం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా వైరస్ బ్లూకీప్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే వినియోగదారులు తమ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ మరోసారి వెల్లడించింది.
‘ఈ మాల్‌వేర్‌ను ఎదుర్కోవడానికి పరిష్కారాన్ని సిద్ధం చేసి రెండు వారాలే అవుతుంది. ఇప్పటి వరకు ఆ వైరస్ జాడలు కనిపించలేదు. అలాగని పూర్తిగా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు కాదు’ అని మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్ డైరెక్టర్ సైమన్ పోప్ హెచ్చరించారు.
‘దీనిపై మేం సిఫార్సు చేసేది ఒక్కటే. సాధ్యమైనంత త్వరగా సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాలి’ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి సైమన్ పోప్ సూచించారు. విండోస్ ఎక్స్‌పీ, విండోస్ 7, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ఈ మాల్‌వేర్ ప్రభావం అధికంగా ఉండనుంది.
కార్పొరేట్ సంస్థల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంటర్నెట్‌తో అనుసంధానమైన కంప్యూటర్లపై మాల్‌వేర్ ప్రభావం అధికంగా ఉంటుందని ఓ మీడియా సంస్థ తెలిపింది.
విండోస్ వాడుతున్న రిమోట్ డెస్క్ టాప్ సిస్టమ్స్‌కు ఆటోమేటిక్‌గా సదరు ‘బ్లూకీప్’ మాల్వేర్ స్పీడ్‌గా విస్తరిస్తుందని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది. కేవలం విండోస్ 8, విండోస్ 10లపై మాత్రమే న్యూ బగ్ ‘బ్లూకిప్’ వైరస్ ఎఫెక్ట్ ఉండదని తెలిపింది. ఇది కోడ్ రూపంలో సిస్టమ్‌పై దాడి చేసి డేటాను నాశనం చేస్తుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించిందని టెక్ క్రంచ్ తెలిపింది.